నిజామాబాద్, జనవరి 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఆదివారం రాత్రి న్యూ అంబేడ్కర్ భవన్‌లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఉత్సాహంగా సాగుతూ, ఉల్లాసాన్ని పంచుతూ, సందేశాత్మకంగా సాగాయి. అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ట్రైనీ కలెక్టర్ సంకేత్ లు ముఖ్య అతిథులుగా హాజరవగా, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా తెలంగాణ సాంస్కృతిక కళాకారులు, గురుకుల పాఠశాలల విద్యార్థినులు, ఇతర కళాకారులు ఆష్ట గంగాధర్ నేతృత్వంలో అబ్బురపరిచే ప్రదర్శనలు ఇచ్చారు.
సద్గురునాథ్ వినసొంపుగా అన్నమయ్య కీర్తనతో కూడిన వేణుగానంతో ఆకట్టుకున్నారు. కుమారి రిద్ధి ఎంతో కష్టతరమైన శాస్త్రీయ నృత్యాన్ని ఎంతో అలవోకగా ప్రదర్శించి ఆహుతుల మన్ననలు అందుకున్నారు. చిన్నారి విభశ్రీ మహిళా ఐపీఎస్ అధికారిణిగా సమాజంలోని దుష్ట శక్తుల భరతం పట్టేలా చేసిన నృత్య ప్రదర్శనకు కరతాళ ధ్వనులు మిన్నంటాయి.
ప్రభుత్వ ఎస్సీ హాస్టల్, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ కు చెందిన బాలికలు ఆలపించిన గేయాలు, నృత్యాలు మంత్రముగ్ధులను చేశాయి. నేటి సమాజంలో అనేకచోట్ల జరుగుతున్న భ్రూణ హత్యలు, మహిళలు, యువతులపై అఘాయిత్యాలు, గృహ హింస, యాసిడ్ దాడులు తదితర సంఘటనలను తమ ప్రదర్శనల ద్వారా కళ్ళకు కట్టినట్టు వివరిస్తూ, వాటిని ఎలా ధైర్యంగా ఎదుర్కోవాలి అనే అంశాలను సాంస్కృతిక ప్రదర్శనల ద్వారా తెలియపర్చారు.
టీ.ఎస్.ఎస్ కళాకారులు చూడచక్కని నాటిక ద్వారా భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటి చెప్పారు. ఇలా, ప్రతి కార్యక్రమం, గేయాలు వేటికవే తన ప్రత్యేకతను చాటుతూ, సందేశాత్మక అంశాల ద్వారా అందరినీ ఆలోచింపజేశాయి. ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ, భారత రాజ్యాంగం అనేక విశిష్టతలతో, ప్రతి పౌరుడి హక్కులు, బాధ్యతలను నిర్దేశిస్తుందన్నారు. ప్రతి ఒక్కరు రాజ్యాంగంలో పొందుపరచబడిన అంశాలను తెలుసుకోవాలని, అప్పుడే తమ హక్కులను కాపాడుకోవచ్చని, అన్యాయం ఎదురైన సందర్భాల్లో న్యాయం పొందవచ్చని సూచించారు. రాజ్యాంగ విలువలను తెలియజేస్తూ చిన్నారులు చేసిన ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయని అన్నారు.
అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించిన కళాకారులు, చిన్నారులను అభినందిస్తూ మెమోంటోలు, శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, డీఐఈఓ రవికుమార్, డీపీఆర్‌ఓ పద్మశ్రీ, సమాచార శాఖ ఉప కార్యనిర్వహక ఇంజనీర్ ఉమేష్ చంద్ర, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ తుకారాం, వివిధ శాఖల అధికారులు, విద్యార్థినీ విద్యార్థులు, మహిళలు, యువతీ యువకులు పాల్గొన్నారు.