హైదరాబాద్, జనవరి 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని భారత రాయబార కార్యాలయ ఆవరణలో ఆదివారం జరిగిన 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గల్ఫ్ కార్మికుల సంక్షేమ సంఘం నేత మంద భీంరెడ్డి పాల్గొన్నారు. అంబాసిడర్ డా. సుహెల్ ఖాన్ ఈ సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి, రాష్ట్రపతి సందేశాన్ని చదివి వినిపించారు. సౌదీలో నివసిస్తున్న ప్రవాస భారతీయ సమూహం దేశభక్తితో నిండిన ఉత్సాహంతో పాల్గొన్నారు.
సౌదీ పర్యటనకు వచ్చిన మంద భీంరెడ్డిని ఈ సందర్బంగా కరీంనగర్ కు చెందిన సామాజిక సేవకులు మహ్మద్ జబ్బార్, అనంతపూర్ కు చెందిన చేతన లు ఎంబసీ ఆవరణలో పలువురు ప్రవాసీలకు, ఎంబసీ అధికారులకు పరిచయం చేశారు.
సౌదీ లోని భారత రాయబారి అంబాసిడర్ డా. సుహెల్ ఖాన్, ఉప రాయబారి అబూ మాతెన్ జార్జి, ఎంబసీ అధికారులు దినేష్ సేతియా, మెయిన్ అఖ్తర్, ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డు గ్రహీత డా. అన్వర్ ఖుర్షీద్, సామాజిక సేవకులు రంజిత్ చిత్తలూరి, షిహాబ్ కొట్టుకుడ్, సిద్దిఖ్ తువ్వూర్, ఫారూఖ్, ఉప్పు సురేష్, జంగిలి హరీష్ తదితరులను మంద భీంరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.