డిచ్‌పల్లి, జనవరి 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
తెలంగాణ విశ్వవిద్యాలయంలో 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా వైస్ ఛాన్సలర్ పరిపాలనా భవనం ఎదుట జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ఆదర్శ రాజ్యాంగాన్ని అందించిన రాజ్యాంగ నిర్మాతలకు ధన్యవాదాలు తెలిపారు. కులం మతం ప్రాంత వివక్ష లేకుండా అందరూ ఆత్మగౌరవంతో జీవించేలా రాజ్యాంగం మరింత పటిష్టంగా అమల అయ్యేలా ప్రతి పౌరుడు కృషి చేయాలన్నారు.
శతాబ్దాలుగా బానిసలుగా జీవించిన భారత పౌరులు స్వేచ్ఛ వాయువులు పీల్చుకొని తమ వ్యక్తిగత జీవితంతో పాటు దేశాభివృద్ధికి పాటుపడేలా రాసిన పవిత్ర గ్రంధం రాజ్యాంగమని కొనియాడారు. రాజ్యాంగము ప్రకారం చట్టం ముందు అందరూ సమానంతో పాటుగా అవకాశాలు అందరికి సమానమని చెబుతుందన్నారు.
రాజ్యాంగం కులం మతం వర్ణం వర్గం లింగ విభేదం లేకుండా యావత్ దేశ ప్రజలందరికీ రక్షణగా నిలుస్తుందన్నారు. ఈ సందర్భంగా వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య ఎం యాదగిరి జ్యోతి ప్రజ్వలనచేసి రాజ్యాంగ నిర్మాతల కృషిని, దేశాభివృద్ధికి వారిచ్చిన దార్శనికత్వాన్ని స్మరించినారు. కార్యక్రమంలో వివిధ విభాగాల అధ్యాపకులు, అధ్యాపకేతర బృందం, ఔట్సోర్సింగ్ సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.