నిజామాబాద్, జనవరి 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
గంజాయి, క్లోరోఫామ్, అల్ఫ్రాజోలం వంటి మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాల నిరోధానికి సంబంధిత శాఖల అధికారులు కలిసికట్టుగా కృషి చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. మత్తు పదార్థాల రవాణా, విక్రయాలపై ఉక్కుపాదం మోపుతూ, నిరంతరం నిఘాను కొనసాగించాలని అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ అధ్యక్షతన సోమవారం జిల్లా స్థాయి మాదకద్రవ్యాల నిరోధక కమిటీ సమావేశం జరిగింది.
బోధన్ శాసన సభ్యులు పి.సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ శాసన సభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ హాజరై, జిల్లాలో మాదకద్రవ్యాల వినియోగం, రవాణా తదితర అంశాలపై కూలంకషంగా చర్చించారు. వాటి నియంత్రణకు చేపట్టాల్సిన చర్యల గురించి పోలీస్, ఎక్సయిజ్, ఔషధ నియంత్రణ మండలి అధికారులకు కలెక్టర్, ఎమ్మెల్యేలు సూచనలు చేశారు. నిజామాబాద్ ను డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
జిల్లాలో గంజాయి సాగు లేనప్పటికీ ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రాంతాల నుండి నిజామాబాద్ మీదుగా గంజాయిని అడపాదడపా మహారాష్ట్రకు స్మగ్లింగ్ చేస్తున్నందున గట్టి నిఘా ఉంచాలన్నారు. ముఖ్యంగా రోడ్డు, రైలు మార్గాల ద్వారా వీటిని రవాణా చేసే అవకాశాలు ఉన్నందున ఆర్టీసీ, రైల్వే అధికారులతో సమన్వయము పెంపొందించుకుని నిరోధక చర్యలు చేపట్టాలని, తనిఖీ కేంద్రాల వద్ద గట్టి నిఘా ఉంచాలని అన్నారు. గంజాయి విక్రేతలను, దానిని వినియోగించే వారిని గుర్తించి కఠిన శిక్ష పడేలా కోర్టులకు సమగ్ర ఆధారాలు సమర్పించాలన్నారు.
కల్తీ కల్లు తయారీ కోసం వినియోగించే అల్ఫ్రాజోలం నిల్వలను వెలికితీయాలని, మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్ధాల గురించి ప్రజలకు వివరిస్తూ విస్తృతస్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. ముఖ్యంగా విద్యార్థులు వీటికి అలవాటుపడకుండా ఉండేందుకు వీలుగా కళాశాలల్లో క్రమం తప్పకుండా అవగాహన సదస్సులు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు.
మత్తు పదార్థాలకు అలవాటుపడిన వారిని ఆ వ్యసనం మానుకునేలా జిల్లా కేంద్రంలో డీ-అడిక్షన్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ మేరకు కలెక్టర్ తన ఛాంబర్లో డి.అడిక్షన్ సెంటర్ ఏర్పాటుపై సంబంధిత అధికారులతో పాటు, ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ విశాల్ తో ప్రత్యేకంగా చర్చించారు. ఈ కేంద్రం ఏర్పాటు దిశగా తక్షణమే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
సమావేశంలో ఎక్సయిజ్ డిప్యూటీ కమిషనర్ వి.సోమిరెడ్డి, నిజామాబాద్ ఏ.సీ.పీ రాజా వెంకట్ రెడ్డి, ఎక్సయిజ్ ఎన్ఫోర్స్ మెంట్ సహాయ సూపరింటెండెంట్ డీసీబీ.నాయక్, డీఎంహెచ్‌ఓ డాక్టర్ రాజశ్రీ, జిల్లా సంక్షేమ అధికారిణి రసూల్ బీ, పోలీస్, ఎక్సయిజ్, రవాణా, ఔషధ నియంత్రణ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.