నిజామాబాద్, ఫిబ్రవరి 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీ టీచర్ల రిటైర్మెంట్ వయసు 60 నుండి 65 సంవత్సరాలకు పెంచడాన్ని నిరసిస్తూ నిజామాబాద్ నగరంలోని దుబ్బా చౌరస్తాలో పిడిఎస్‌యు విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ సందర్భంగా పిడిఎస్‌యు జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వేలాదిమంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం తమ ఇంటిని, తల్లిదండ్రులను కుటుంబాలను వదిలి ఉద్యోగాల కొరకు కష్టపడి చదువుతున్నారన్నారు.
యూనివర్సిటీల్లో బోధన, బోధనేతర సిబ్బంది ఖాళీల భర్తీ నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారన్నారు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్యము వహిస్తూ, ఇప్పుడున్న ఉద్యోగుల, యూనివర్సిటీ టీచర్ల రిటైర్మెంట్ వయసు 60 నుండి 65 సంవత్సరాలు వరకు పెంచడం సిగ్గు చేటన్నారు. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, యూనివర్సిటీలో ఖాళీ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్లు విడుదల చేయాలన్నారు.
అన్ని ప్రభుత్వ శాఖలోని ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 ఏళ్లకే పరిమితం చేయాలని, ఖాళీ పోస్టుల భర్తీ కోసం ఉద్యోగ క్యాలెండర్ ను ప్రకటించి, ఎప్పటికప్పుడు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉదృతం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
కార్యక్రమంలో పిడిఎస్‌యు నగర నాయకులు నాగేష్, నజీర్, రేహాన్, సంతోష్, రాజు తదితరులు పాల్గొన్నారు.