నిజామాబాద్, ఫిబ్రవరి 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 141 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌తో పాటు, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, డీఆర్డీఓ సాయాగౌడ్, ఆర్డీఓ రాజేంద్రకుమార్, మెప్మా పీ.డీ రాజేందర్, ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు.
కాగా, అర్జీలను పెండిరగ్ పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను సూచించారు. ఈ సందర్భగా డీ-వార్మింగ్ డే ను పురస్కరించుకుని జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన గోడ ప్రతులను కలెక్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీ.ఎం.హెచ్.ఓ డాక్టర్ రాజశ్రీ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.