నిజామాబాద్, ఫిబ్రవరి 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
శాసన మండలి ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలను పురస్కరించుకుని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మంగళవారం బోధన్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాలకు సంబంధించి వేర్వేరుగా ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్ల పరిధిలో ఓటర్ల సంఖ్య గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
పోలింగ్ ప్రక్రియకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. పోలింగ్ స్టేషన్లలో అందుబాటులో ఉన్న సదుపాయాలు కలెక్టర్ పరిశీలించారు. ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా ప్రతి పోలింగ్ స్టేషన్ లో మౌలిక వసతులు కల్పించాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, స్థానిక అధికారులు ఉన్నారు.
ఎడపల్లి పీ.హెచ్.సీ తనిఖీ
అంతకుముందు కలెక్టర్ ఎడపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలను పరిశీలించారు. స్థానికంగా నిర్వహిస్తున్న రక్త పరీక్షలు, రోగులకు అందిస్తున్న చికిత్సల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ప్రతి రోజు ఎంత మంది రోగులు చికిత్స కోసం ఆసుపత్రికి వస్తున్నారనే వివరాలను రిజిస్టర్లో పరిశీలించారు. గర్భిణీలకు క్రమం తప్పకుండా ఏ.ఎన్.సీ పరీక్షలు చేయాలని, అన్ని రకాల మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని వైద్యులకు సూచించారు. స్థానికంగా అందుబాటులో ఉంటూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.