పిల్లలందరికి నులిపురుగు నివారణ మాత్రలు అందించాలి…

కామారెడ్డి, ఫిబ్రవరి 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

నులిపురుగుల నివారణ మాత్రను ప్రతీ ఒక్కరికీ అందించాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌ మినీ సమావేశ మందిరంలో జిల్లా టాస్క్‌ ఫోర్స్‌ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, పాఠశాలలు, కళాశాలలోని విద్యార్థులు, అంగన్వాడీ కేంద్రాల్లోని పిల్లలు, బడిబయట ఉన్న పిల్లలందరికీ నులిపురుగుల నివారణ మాత్రను ఫిబ్రవరి 10 న ఆయా పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలలో అందించాలని తెలిపారు.

జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ చంద్రశేఖర్‌ మాట్లాడుతూ, ఇప్పటివరకు 14 రౌండ్ల కార్యక్రమాలు నిర్వహించామని, ఈ నెల 10 న 15 వ రౌండ్‌ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుందని, అన్ని ఏర్పాట్లు చేపడుతున్నామని తెలిపారు. ఈ నెల 17 మిగిలి పోయిన చిన్నారులకు వేయడం జరుగుతుందని తెలిపారు. మాత్ర వేసుకున్న తదుపరి వాంతులు జరిగినచో వెంటనే వారికి వైద్య సేవలు అందించడానికి డాక్టర్ల బృందం, 102, 108, ఆర్బిఎస్కే వాహనాలను సిద్ధం చేయడం జరిగిందని వివరించారు.

ప్రోగ్రాం ఆఫీసర్‌ డాక్టర్‌ విద్య మాట్లాడుతూ, ఈ మాత్ర వేసుకోవడం ద్వారా ఎనీమియా, ఇతర ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని తెలిపారు. ఇప్పటికే శిక్షణ కార్యక్రమాలు నిర్వహించామని, నోడల్‌ అధికారులను గుర్తించామని తెలిపారు. అవసరమైన ఆల్బెండజోల్‌ మాత్రలను సిద్ధంగా సమకూర్చడం జరిగిందని తెలిపారు. మండల స్థాయి టాస్క్‌ ఫోర్స్‌ కమిటీ సమావేశాలు నిర్వహించామని తెలిపారు.

మాత్ర పంపిణీ రోజున ప్రతీ విద్యార్థి పాఠశాలకు వచ్చే విధంగా ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. గ్రామ స్థాయిల్లో టాం టాం నిర్వహించుటకు పంచాయతీ అధికారులను కోరడం జరిగిందని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారిణి ప్రమీల, రెడ్‌ క్రాస్‌ చైర్మన్‌ రాజన్న, మెప్మ పిడి శ్రీధర్‌ రెడ్డి, గ్రామీణాభివృద్ధి డిపిఎం రమేష్‌, వివిధ శాఖల అధికారులు, పాల్గొన్నారు.

Check Also

గుండె ఆపరేషన్‌ నిమిత్తం రక్తదానం…

Print 🖨 PDF 📄 eBook 📱 కామరెడ్డి, ఫిబ్రవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »