నిజామాబాద్, ఫిబ్రవరి 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాలతో కూడిన శాసన మండలి ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలను పురస్కరించుకుని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఆర్మూర్, బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని భీంగల్, వేల్పూర్, పెర్కిట్ ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు.
పోలింగ్ స్టేషన్లలో అందుబాటులో ఉన్న వసతులను తనిఖీ చేశారు. ర్యాంప్, టాయిలెట్స్, విద్యుత్ సరఫరా, నీటి వసతి ఇత్యాది సదుపాయాలను పరిశీలించారు. ప్రతిపాదిత పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి అవాంతరాలు లేకుండా సాఫీగా పోలింగ్ ప్రక్రియ జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు. ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాలకు వేర్వేరుగా ఎంపిక చేసిన పోలింగ్ స్టేషన్లలో లోటుపాట్లు లేకుండా అన్ని సదుపాయాలు సక్రమంగా ఉన్నాయా లేవా అని పక్కాగా నిర్ధారణ చేసుకోవాలని సూచించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ ఆయా పాఠశాలల్లో మధ్యాహ్న భోజనము నాణ్యతను తనిఖీ చేశారు. విద్యార్థినీ విద్యార్థుల కోసం వండిన అన్నం, కూరలతో పాటు పాఠశాలలకు కేటాయించిన బియ్యం నిల్వలు, కూరగాయలు, ఇతర సరుకులను పరిశీలించారు. భీంగల్ మైనారిటీ రెసిడెన్షియల్ బాలుర పాఠశాలలో విద్యార్థులకు పంపిణీ చేసిన దుప్పట్లు, కాస్మొటిక్ కిట్‌లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
జిల్లాలోని ఇతర సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు కూడా వీటి పంపిణీ జరిగిందా అని ఆరా తీశారు. పలు తరగతి గదులకు వెళ్లి బోధనా తీరును పరిశీలించిన కలెక్టర్, బాలబాలికలకు పలు ప్రశ్నలు అడిగి వారి అభ్యసన సామర్థ్యాన్ని పరీక్షించారు. వార్షిక పరీక్షలు సమీపించినందున సకాలంలో సిలబస్ పూర్తయ్యేలా ప్రణాళికాబద్ధంగా బోధన చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. పదవ తరగతిలో అత్యుత్తమ గ్రేడ్ పాయింట్లతో విద్యార్థులందరూ ఉత్తీర్ణత సాధించేలా వారిని అన్ని విధాలుగా సన్నద్ధం చేయాలని అన్నారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్, స్థానిక అధికారులు ఉన్నారు.