నిజామాబాద్, ఫిబ్రవరి 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
విపత్తులు సంభవించిన సమయాల్లో వెనువెంటనే సహాయక చర్యలు చేపట్టేలా ఆపద మిత్ర వాలంటీర్లకు వివిధ అంశాలలో అందిస్తున్న శిక్షణ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. సుశిక్షితులైన ఎన్.డీ.ఆర్.ఎఫ్, అగ్నిమాపక, మత్స్య శాఖ అధికారులతో పాటు మాస్టర్ ట్రైనర్స్ ద్వారా విపత్తులను సమర్ధవంతంగా ఎదుర్కొనే అంశాలపై ఆపదమిత్ర వాలంటీర్లకు శిక్షణ అందిస్తుండగా, వారు ఉత్సాహంగా, ఉల్లాసంగా పాల్గొంటున్నారు.
జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్ వద్ద రఘునాథ చెరువులో బుధవారం వరదలు, నీటి ప్రమాద ఘటనలు జరిగినప్పుడు చేపట్టాల్సిన సహాయక చర్యలపై ఆపదమిత్రలకు ప్రయోగాత్మక శిక్షణ ద్వారా అవగాహన కల్పించారు. అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ శిక్షణా కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. రెస్క్యూ బోట్ ను ఎలా ఆపరేట్ చేయాలి, రెస్క్యూ రోప్, రెస్క్యూ ట్యూబ్, రెస్క్యూ గార్డ్, ఫ్లోటర్ తదితర వాటిని ఎలా వినియోగించాలి అనే అంశాలను హైదరాబాద్ లోని మణికొండ కు చెందిన నోబుల్ లైఫ్ సేవింగ్ సొసైటీకి చెందిన మాస్టర్ ట్రైనర్ మహేష్, వినోద్, అనితా పటేల్ లు స్వయంగా చేసి చూపిస్తూ, ఆపదమిత్ర కార్యకర్తలతో చేయించారు.
![](https://i0.wp.com/telanganalive.com/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-12-at-6.21.52-PM.jpeg?resize=618%2C278)
ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ, ప్రకృతిపరంగా, మానవ తప్పిదాల వల్ల విపత్తులు సంభవించిన సందర్భాల్లో ఆపదమిత్ర కార్యకర్తలు తక్షణమే స్పందించి సహాయక చర్యలు చేపట్టే విధంగా వారిని అన్ని విధాలుగా సన్నద్ధం చేయడం జరుగుతోందని అన్నారు. అగ్ని ప్రమాదాలు, భూకంపాలు, వరదలు, నీటి ప్రమాదాలు, భారీ జన సందోహం సమయాల్లో తొక్కిసలాట నివారణ, అత్యవసర పరిస్థితుల్లో అందించాల్సిన సేవలు తదితర అంశాలపై మూడు దశల్లో 22 రోజుల పాటు ఆపద మిత్రలకు శిక్షణ అందించడం జరుగుతోందన్నారు.
శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి పది వేల రూపాయల విలువ చేసే విపత్తు సహాయ పరికరాలు అందించడంతో పాటు గుర్తింపు కార్డులు, బీమా సదుపాయాన్ని వర్తింపజేస్తామని అన్నారు. ఈ నెల 22వ తేదీ వరకు శిక్షణ అందించడం జరుగుతుందన్నారు. జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి టి.పరమేశ్వర్, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ ఏ.విక్రమ్, కలెక్టరేట్ లోని విపత్తుల విభాగం పర్యవేక్షకులు శ్రీనివాస్ రావు తదితరులు శిక్షణ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.