కామారెడ్డి, ఫిబ్రవరి 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
కాలానుగుణ వాతావరణ పరిస్థితుల మార్పులకు అనుగుణంగా రానున్న వేసవి కాల పరిస్థితుల దృష్ట్యా సంభవించే ఆరోగ్య సమస్యలను నివారించడానికి తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు వైద్య, ఆరోగ్య శాఖ అధ్వర్యంలో జాతీయ వాతావరణ మార్పుల ఆరోగ్య సమస్యల నియంత్రణ కార్యక్రమంలో భాగముగా శుక్రవారం కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యలయంలో కరపత్రాలు, గోడప్రతులను జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ జిల్లాలో క్షేత్ర స్థాయిలో ప్రతి మండల గ్రామ పంచాయతీల వారీగా తీవ్రమైన ఎండల వల్ల సంభవించే వడ దెబ్బ తదితర అత్యవసర ప్రజారోగ్య సమస్యల గురించి ప్రజలలో అవగాహన కల్పించాలని, ఇట్టి విషయంలో వైద్య సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వుంటూ తీవ్రమైన వేడి వల్ల వచ్చే వడ దెబ్బ ఇతర ఆరోగ్య సమస్యలు సంభవించినప్పుడు వెంటనే స్పందించాలని సూచించారు. ఆవిష్కరించిన గోడ ప్రతులను, కర పత్రాలను విస్తృతంగా ప్రజలకు చేరవేయాలని ఆదేశించారు.
కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డా.చంద్రశేఖర్, ఎన్.సి.డి.ప్రోగ్రాం అధికారి డా.శిరీష, వ్యాధి నిరోధక టీకాల అధికారి డా.విద్య, అదనపు జిల్లా వైద్యాధికారి డా.ప్రభు దయా కిరణ్, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి ఎన్.భీమ్ కుమార్, వైద్యాధికారులు పాల్గొన్నారు.