నిజామాబాద్, ఫిబ్రవరి 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
అనుకోని రీతిలో విపత్తులు సంభవించిన సమయాల్లో తక్షణ సహాయక చర్యలు చేపట్టేందుకు వీలుగా ఆపద మిత్ర వాలంటీర్లకు శిక్షణ అందిస్తుండగా, వంద మందితో కూడిన మొదటి బ్యాచ్ విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకుంది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలనే అంశాలపై ఎంపిక చేసిన సుమారు 300 మంది కమ్యూనిటీ వాలంటీర్లకు మూడు విడతలుగా ‘ఆపద మిత్ర’ శిక్షణ అందిస్తున్నారు.
మొదటి బ్యాచ్ శిక్షణ పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లా కేంద్రంలోని న్యాక్ భవనంలో ఏర్పాటు చేసిన ముగింపు కార్యక్రమానికి అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి వాలంటీర్లను అభినందించారు. ప్రకృతిపరంగా, మానవ తప్పిదాల వల్ల విపత్తులు సంభవించిన సందర్భాల్లో స్థానికంగా ఉండే సామాజిక కార్యకర్తలు తక్షణమే స్పందించి సహాయక చర్యలు చేపట్టాలనే ముఖ్య ఉద్దేశ్యంతో ఆపద మిత్ర పేరిట శిక్షణ అందించడం జరిగిందని అన్నారు. జాతీయ, రాష్ట్ర స్థాయిలలో విధులు నిర్వర్తించే ఎన్.డీ.ఆర్.ఎఫ్, ఎస్.డీ.ఆర్.ఎఫ్, బృందాలు ప్రతీ చోట అందుబాటులో ఉండే అవకాశాలు లేనందున కమ్యూనిటీ వాలంటీర్లకు శిక్షణ అందించడం జరుగుతోందన్నారు.
విపత్తులు సంభవించిన సమయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆస్తి, ప్రాణ నష్టాన్ని ఎలా నివారించాలి తదితర అంశాలపై ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బందితో పాటు అగ్నిమాపక తదితర శాఖల ఆధ్వర్యంలో ప్రయోగాత్మకంగా శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న వాలంటీర్లు నేర్చుకున్న అంశాలను గుర్తుంచుకుని, విపత్తులు వాటిల్లిన సమయాల్లో సుశిక్షితులైన సైనికుల తరహాలో సమర్ధవంతంగా సేవలు అందించాలని సూచించారు. ఈ సందర్బంగా వాలంటీర్లు తమ అనుభవాలను, నేర్చుకున్న అంశాల గురించి పంచుకున్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.