కామారెడ్డి, ఫిబ్రవరి 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజావాణి లో వచ్చిన అర్జీలను సంబంధిత శాఖల అధికారులు పరిశీలించి సత్వర చర్యలు తీసుకోవాలని తెలిపారు. సోమవారం ప్రజావాణిలో (58) అర్జీలు వచ్చాయన్నారు. భూ సమస్యలు, రైతు భరోసా, వ్యక్తిగత సమస్యలు వంటి దరఖాస్తులు వచ్చాయి. ప్రజావాణిలో అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి.విక్టర్, జడ్పీ సీఈవో చందర్ నాయక్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
జిల్లా, మండల అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించాలని, తమ శాఖకు సంబంధించిన పనులను పర్యవేక్షించాలని, క్షేత్ర స్థాయిలోని అధికారులతో సమీక్షలు నిర్వహించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. తహసీల్దార్లు ఎల్.ఆర్.ఎస్., ధరణీ వంటి వాటిని పరిశీలించి చర్యలు చేపట్టాలని తెలిపారు. మండల పరిషత్ అధికారులు ప్రాపర్టీ టాక్స్, పారిశుధ్యం, సెగ్రిగేషన్ షెడ్స్, నర్సరీ, మొక్కల పెంపకం వంటి వాటిపై సమీక్షలు నిర్వహించి, చర్యలు తీసుకోవాలని తెలిపారు.
వివిధ పత్రికల్లో వచ్చే ప్రతికూల వార్తలకు సంబంధిత శాఖల అధికారులు రిజైన్డర్స్ ఇవ్వాలని అన్నారు. వీటిపై త్వరలో సమీక్షించడం జరుగుతుందని తెలిపారు.

సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో ఇటీవల పాల్గొనని కుటుంబాల వివరాలు నేటి నుండి 28 వరకు ఇటీవల సర్వే లో నమోదు చేసుకొనని కుటుంబాల వివరాలు ఎంట్రీ చేసుకునే విధంగా ప్రభుత్వం మరొక అవకాశం కల్పించిందని తెలిపారు. సర్వేకు సంబంధించిన కుటుంబ వివరాలు నమోదు చేసుకునేందుకు మండల అభివృద్ధి అధికారి కార్యాలయాలు, మున్సిపల్ కార్యాలయాల్లోని ప్రజా పాలన సేవా కేంద్రాల్లో నిర్ణీత పొఫార్మాలో పూర్తి వివరాలు నమోదు చేసుకోవచ్చని, లేదా ప్రభుత్వం ఇట్టి విషయంలో ఏర్పాటుచేసిన టోల్ ఫ్రీ నెంబర్ 040- 21111111 నకు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు సదరు కుటుంబ వివరాలు తెలియజేయవచ్ఛని, అట్టి వివరాల ఆధారంగా ఆ కుటుంబం వద్దకు సిబ్బందిని పంపించి సర్వే వివరాలను తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
రాష్ట్ర స్థాయి నుండి వచ్చే సమాచారాన్ని సంబంధిత మండల అధికారులకు పంపించడం జరుగుతుందని, వాటిపై చర్యలు తీసుకోవాలని అన్నారు. లేదా ప్రభుత్వ వెబ్ సైట్ నుండి దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకొని పూర్తి వివరాలు నమోదు చేసి ప్రజాపాలన సేవా కేంద్రంలో అందించవచ్చని తెలిపారు. అట్టి వివరాలు ఆన్‌లైన్‌లో పొందపరచడం జరుగుతుందని తెలిపారు.