కామారెడ్డి, ఫిబ్రవరి 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
పదవ తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ కణబరచాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం రాజంపేట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను పరిశీలించారు. సోమవారం పదవ తరగతి గదిలోకి వెళ్ళి విద్యార్థులు చదువుతున్న తీరును ఆరా తీసారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వచ్చే వార్షిక పరీక్షలో వంద శాతం ఉత్తర్ణత సాధించాలని, శ్రద్ధ పెట్టి చదవాలని అన్నారు.
టీచర్ చెప్పిన పాఠాన్ని శ్రద్ధగా విని అర్థం చేసుకోవాలని, అర్థంకాని విషయాలను అడిగి తెలుసుకోవాలని అన్నారు. పరీక్ష సమయంలో ఒత్తిడికి లోనుకాకుండా శ్రద్ధతో చదవాలని తెలిపారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టీ చదివించాలని చెప్పారు. ఏ సబ్జెక్టులో వెనుకబడి ఉన్నారో తెలుసుకొని సంబంధిత టీచర్ పర్యవేక్షణలో ప్రత్యేకంగా తరగతులు నిర్వహించాలని తెలిపారు.

గత సంవత్సరం 92 శాతం మంది ఉత్తీర్ణత సాధించారని, ఈ సంవత్సరం వంద శాతం సాధించేలా విద్యార్థులను తయారు చేయాలనీ సూచించారు. మాథ్స్ టీచరుగా కలెక్టర్ బోర్డుపై స్వయంగా లెక్క రాస్తూ విద్యార్థులచే లెక్కలకు సమాధానాలు రాబట్టారు. విద్యార్థులు మరింత దీక్షతో చదివితే మంచి స్థానంలో రాణిస్తారని తెలిపారు. ఉదయం, సాయంత్రం వేళల్లో పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ వారి పురోగతికి టీచర్లు కృషి చేస్తున్నారని హెడ్ మాస్టర్ ఈశ్వరయ్య తెలిపారు. విద్యార్థులకు నిట్యుస్తకాలు, పెన్నులను కలెక్టర్ అందించి ఆల్ ద బెస్ట్ చెప్పారు.
కార్యక్రమంలో జిల్లా విద్యా శాఖాధికారి రాజు, మండల విద్యా శాఖాధికారి పూర్ణచందర్, తహసీల్దార్ అనీల్, ఇన్చార్జి ఎంపీడీఓ రఘువీర్, టీచర్లు తదితరులు పాల్గొన్నారు.