కామారెడ్డి, ఫిబ్రవరి 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
రానున్న వేసవిలో నీటి ఎద్దడి సమస్య తలెత్తకుండా కార్యచరణ రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుండి వివిధ శాఖల ముఖ్య కార్యదర్షులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జిల్లా అధికారులతో సాగునీరు, త్రాగునీరు, నిర్మాణ రంగానికి విద్యుత్ అంతరాయం కలగకుండా విద్యుత్ సరఫరా, రైతు భరోసా, రబీ సీజన్ కు సాగునీటి సరఫరా, యూరియా కొరత, రేషన్ కార్డుల జారీ, రెసిడెన్షియల్ పాఠశాలల సందర్శన అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ వచ్చే వేసవికాలం దృష్ట్యా ప్రజలకు త్రాగునీటి ఇబ్బందులు లేకుండా కార్యచరణ రూపొందించి నిరంతరం నీటిని అందించే విధంగా ప్రణాళిక బద్ధంగా అమలు చేయాలని తెలిపారు. రబీ సీజన్ కొరకు సాగునీటి సమస్య లేకుండా ప్రాజెక్టులు, చెరువులపై సమీక్షించి ముందస్తు చర్యలు చేపట్టాలని తెలిపారు. వ్యవసాయ సాగులో రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని, ఈ నేపథ్యంలో యూరియా కొరత లేకుండా చూడాలని తెలిపారు. వేసవికాలంలో వ్యవసాయానికి, త్రాగునీటికి, నిర్మాణ రంగానికి విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు.
అర్హత గల ప్రతి రైతుకు రైతు భరోసా అందించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రజాపాలనలో రేషన్ కార్డుల కొరకు వచ్చిన దరఖాస్తులలో అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు జారీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గురుకుల పాఠశాలలను జిల్లా అధికారులు సందర్శించి పాఠశాలలో నెలకొన్న సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని తెలిపారు.

వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులతో మాట్లాడుతూ, జిల్లాలోని 860 హాబిటేషన్స్ ఉండగా, 17 హాబిటేషన్సలో త్రాగునీటి సమస్య ఉందని, ఆయా గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా అయ్యే విధంగా చూడాలని తెలిపారు. పత్రికల్లో వచ్చే వ్యతిరేక వార్తలపై అధికారులు స్పందించి రేజాయిన్డర్ జారీ చేయాలని తెలిపారు. బోర్ వెల్స్ లను మరమ్మత్తులు చేయించాలని తెలిపారు. రేషన్ కార్డుల వెరిఫికేషన్ కు సంబంధించి రోజువారీ రిపోర్టులు సమర్పించాలని తెలిపారు.
వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్లు వి.విక్టర్, శ్రీనివాస్ రెడ్డి, సబ్ కలెక్టర్ కిరణ్మయి, నీటిపారుదల శాఖ సిఈ రవి, మిషన్ భగీరథ ఎస్‌ఈ రాజేంద్ర కుమార్, విద్యుత్ శాఖ ఎస్‌ఈ శ్రావణ్ కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్, ఆర్డీఓ ప్రభాకర్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రావు, జిల్లా పౌర సరఫరాల అధికారి మల్లికార్జున్ బాబు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.