Breaking News

తాగు, సాగునీరు, విద్యుత్‌ సరఫరాను నిరంతరం పర్యవేక్షించాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఎక్కడ కూడా తాగునీరు, సాగునీరు, విద్యుత్‌ సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా నిరంతరం పర్యవేక్షణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి సూచించారు. ఎక్కడైనా సమస్య ఉత్పన్నమైతే, సత్వరమే పరిష్కరించాలని అన్నారు. ఏ ఒక్క నివాస ప్రాంతంలోనూ మంచినీటి సరఫరాలో ప్రజలకు ఇబ్బందులు రాకుండా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి శాంతికుమారి మాట్లాడుతూ, వేసవికాలం సమీపిస్తున్న దృష్ట్యా తాగునీటి సరఫరాను అనునిత్యం నిశితంగా పర్యవేక్షించాలని, ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలన్నారు.

జలాశయాలలో నీటి నిల్వలు అందుబాటులో ఉన్నందున వేసవిలో నీటి ఎద్దడి నెలకొనకుండా, లీకేజీలకు తావులేకుండా మంచినీటి సరఫరా వ్యవస్థను పటిష్టపర్చాలని సూచించారు. తాగునీటి సరఫరాకు సంబంధించిన సమస్యల పరిష్కారానికై కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేయాలని, టోల్‌ ఫ్రీ నెంబర్‌ 18005994007 ద్వారా కూడా ప్రజలు తాగునీటి సమస్య గురించి ఫిర్యాదు చేయవచ్చని అన్నారు. క్షేత్ర స్థాయిలో ఏర్పడే ఇబ్బందులను పరిష్కరించేందుకు అవసరమైన బృందాలను ఏర్పాటు చేయాలని, తాగునీటి సరఫరాకు సంబంధించి క్షేత్రస్థాయి నుంచి క్రమం తప్పకుండా సమాచారం సేకరించాలని కలెక్టర్లకు సూచించారు.

అన్ని పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలకు మిషన్‌ భగీరథ జలాలను సరఫరా చేసేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని, స్థానికంగా అందుబాటులో ఉన్న జల వనరులను వేసవి సీజన్‌ చివరలో వినియోగించుకునేందుకు వీలుంటుందని అన్నారు. పట్టణాలలో ఏర్పడిన నూతన కాలనీలు, చివరి ఆవాస ప్రాంతాలలో తాగునీటి సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని, ఇబ్బందులు ఉన్న ప్రాంతాలకు ప్రత్యామ్నాయంగా ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా కోసం ప్రణాళికలు రూపొందించుకోవాలని తెలిపారు. అదేవిధంగా రబీ పంటలు చేతికందే వరకు సాగు నీటి వసతి కల్పించేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని సూచించారు.

తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్‌ సాగర్‌ ప్రాజెక్టు ద్వారా ఆయా జిల్లాలలోని నిర్దేశిత ఆయకట్టుకు ఇప్పటివరకు ఎన్ని తడులు నీటిని అందించారు, ఇంకా ఎన్ని తడులు అందిస్తారని వివరాలను అడిగి తెలుసుకున్నారు. సాగునీటి అక్రమ వినియోగాన్ని నిలువరించేందుకు వీలుగా పోలీసు, రెవెన్యూ అధికారులతో సమన్వయము పెంపొందించుకుని కాల్వల వెంబడి నిఘా ఉంచాలని, తద్వారా చివరి ఆయకట్టు వరకు సాగు జలాలు అందేలా కృషి చేయాలన్నారు.

సాగు, తాగునీటి పథకాలకు నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రానున్న మార్చి, ఏప్రిల్‌, మే మాసాలలో విద్యుత్‌ వినియోగం పెరిగే అవకాశాలు ఉన్నందున ముందస్తుగానే ప్రణాళికలు రూపొందించుకుని వ్యవసాయానికి, గృహావసరాలకు, పరిశ్రమలకు కోతలు లేకుండా నాణ్యమైన కరెంటు సరఫరా చేయాలని సూచించారు. రాష్ట్ర అవసరాలకు సరిపడా విద్యుత్‌ ఉత్పాదకత ఉన్నందున, సరఫరా లోపాలను సవరించుకుని ఆయా రంగాలకు కోతలు లేకుండా విద్యుత్‌ సరఫరా జరిగేలా చూడాలన్నారు.

రాష్ట్రంలో ఎక్కడైనా విద్యుత్‌ సరఫరాలో ఇబ్బందులు ఉంటే టోల్‌ ఫ్రీ నెంబర్‌ 1912 కు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. కాగా, సాగుకు యోగ్యమైన వ్యవసాయ భూమి కలిగి పంటలు పండిస్తున్న ప్రతి రైతుకు రైతు భరోసా కింద ఆర్ధిక తోడ్పాటును అందించేందుకు చొరవ చూపాలన్నారు. కొత్త రేషన్‌ కార్డుల కోసం ప్రజాపాలన గ్రామ సభలు, ఇతరత్రా మార్గాల ద్వారా వచ్చిన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను సత్వరమే పూర్తిచేసి, అర్హులైన వారందరికీ రేషన్‌ కార్డులు జారీ అయ్యేలా వివరాలను ఆన్లైన్‌ లో నమోదు చేయించాలని సూచించారు.

ప్రభుత్వ గురుకుల పాఠశాలలను క్రమం తప్పకుండా సందర్శిస్తూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, పక్కాగా మెనూ అమలయ్యేలా పర్యవేక్షణ జరపాలని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌ లో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Check Also

రాష్ట్రంలో కూడా బిజెపి జెండా ఎగరవేస్తాం…

Print 🖨 PDF 📄 eBook 📱 బాన్సువాడ, ఫిబ్రవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »