ఆర్మూర్, ఫిబ్రవరి 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
క్షత్రియ పాఠశాల చేపూర్ నందు ఛత్రపతి శివాజి జయంతి వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించినారు. ఈ సందర్భంగా నిర్వహింపబడిన కార్యక్రమంలో శివాజీ చిత్ర పటానికి పుష్పాంజలి గావించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపాల్ లక్ష్మీ నరసింహస్వామి మాట్లాడుతూ శివాజి గొప్ప చక్రవర్తియే గాకుండా హిందూ ధర్మ పరిరక్షకుడని అన్నారు.
గొరిల్లా యుద్ధనీతిలో ఆరితేరినవాడని, మొఘల్ సామ్రాజ్యాధిపతులకు పక్కలో బళ్లెంలా నిలిచాడని పేర్కొన్నారు. కార్యక్రమానికి క్షత్రియ విద్యా సంస్థల ఆధిపతి అల్జాపూర్ శ్రీనివాస్ తమ సందేశాన్ని పంపుతూ శివాజీ యొక్క మొదటి గురువు ఆతని తల్లి జిజియాబాయి అని, చిన్న వయసులో రామాయణ, మహాభారతగాథలను తెలియజెప్పి గొప్ప వీరునిగా తీర్చి దిద్దిందని అన్నారు.
క్రీ.శ. 1674లో రాయఘడ్ లో పట్టాభిషిక్తుడై ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకున్నాడని అన్నారు. మరాఠా యోధునిగా, హిందూ సామ్రాజ్య పరిరక్షకునిగా శివాజీ స్థానం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడి ఉన్నదని అల్జాపూర్ శ్రీనివాస్ గారు పేర్కొన్నారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.