కామారెడ్డి, ఫిబ్రవరి 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
త్రాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు ప్రణాలికలు సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. గురువారం ఎల్లారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో త్రాగునీరు, పారిశుధ్యం, పన్నుల వసూళ్లు తదితర అంశాలపై కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వచ్చే వేసవి కాలంలో పట్టణ ప్రజలకు త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా ప్రతీరోజూ నిరంతర నీటి సరఫరా అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.
అవసరమైన పక్షంలో బోర్ వెల్స్ మరమ్మత్తులు చేయించాలని తెలిపారు. పట్టణంలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. పట్టణంలో పారిశుధ్య కార్యక్రమాలు నిరంతరం కొనసాగించాలని తెలిపారు. ఇంటింటి చెత్త సేకరణ ప్రతీ రోజూ నిర్వహించాలని, సేకరించిన చెత్తను డంపింగ్ యార్డ్ కు తరలించాలని తెలిపారు. డంపింగ్ యార్డ్ లో సిగ్రిగేషన్ షేడ్ లో విడివిడిగా సెగ్రిగేట్ చేయాలని తెలిపారు. 12 వార్డ్ లలోని చెత్తను 7 వాహనాల ద్వారా చెత్త సేకరణ చేపడుతున్నామని మున్సిపల్ సిబ్బంది కలెక్టర్ కు వివరించారు.

పారిశుధ్య సిబ్బంది వేతనాలు సక్రమంగా చెల్లించాలని, ఈ.పి.ఎఫ్., ఈఎస్‌ఐ చెల్లించాలని తెలిపారు. అనంతరం మిషన్ భగీరథ, అమృత్ పథకం క్రింద చేపడుతున్న పనులపై సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షించారు. లీకేజీలను సత్వరమే మూసివేయాలని తెలిపారు. మున్సిపల్ పరిధిలో నాటిన మొక్కలకు వాటరింగ్ నిర్వహించి సంరక్షించాలని తెలిపారు.
అనంతరం డి.ఆర్.సి.సి. కేంద్రం, సెగ్రిగేశన్ షేడ్ లను కలెక్టర్ పరిశీలించారు. కంపోస్టు ఎరువును వినియోగంలోకి తీసుకురావాలని తెలిపారు. డంపింగ్ యార్డ్ ల నిర్వహణ సక్రమంగా నిర్వహించాలని తెలిపారు.

అనంతరం తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ బాలికల రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల ను కలెక్టర్ సందర్శించి, పదవ తరగతి విద్యార్థుల చదువు, వార్షిక పరీక్షల సన్నద్ధత, భోజనం తదితర అంశాలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. గత సంవత్సరం ఉత్తర్ణత శాతం వివరాలు అడిగారు. ఈ సంవత్సరం కూడా వంద శాతం ఉత్తీర్ణత శాతం సాధించాలని తెలిపారు. పరీక్షల నేపథ్యంలో ఒత్తిడికి లోనుకాకుండా ఉండాలని తెలిపారు. వచ్చే సంవత్సరం ట్రిపుల్ ఐటీ లో సీటు సాధించాలని సూచించారు. విద్యార్థులతో శానిటేషన్ పోస్టర్ ను , మాథ్స్ , ఫిజికల్ సైన్స్ కు సంబంధించిన వాటిపై విద్యార్థులను అడిగి బోర్డుపై జవాబు రాబట్టారు.
కార్యక్రమంలో ఆర్డీఓ ప్రభాకర్, మున్సిపల్ కమీషనర్ రమేష్, తహసీల్దార్ మహేందర్, ఇన్చార్జి ఎంపీడీఓ ప్రకాష్, పలు శాఖల అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు, పాఠశాల ఉపాద్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.