భీంగల్, ఫిబ్రవరి 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
మహారాష్ట్ర రాష్ట్రం పూణేలోని శివ్ ఛత్రపతి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో 2024- 25 సంవత్సరానికి గాను ఫిబ్రవరి 17 నుండి 22 వరకు 6 రోజులు నిర్వహిస్తున్న ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ క్యారం టోర్నీకి తెలంగాణ రాష్ట్రం నుండి ఎంపికైన భీంగల్ పట్టణ కేంద్రానికి చెందిన నేషనల్ సీనియర్ క్యారం ప్లేయర్ నూతికట్టు సతీష్ (భీంగల్) పార్ట్నర్ అబ్దుల్ సలీమ్ (నిజామాబాద్)లు టీం ఛాంపియన్ షిప్‌లో తెలంగాణ రాష్ట్ర జట్టు నుండి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
17 సోమవారం సిమ్లా రాష్ట్రంతో, 18 మంగళవారం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర క్యారం క్రీడా కారులతో హోరాహోరీ తలపడి రెండు రౌండ్లలో తమ సత్తా చాటి విజేతలుగా నిలిచారని భీంగల్ పట్టణ కేంద్రానికి చెందిన సీనియర్ క్యారం ప్లేయర్ కంకణాల రాజేశ్వర్ బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు.
ఈ సందర్భంగా కంకణాల రాజేశ్వర్ మాట్లాడుతూ… మూడవ రౌండ్ లో మహారాష్ట్రతో తలపడనున్నారని వివరించారు. క్యారం క్రీడకు భీంగల్ పట్టణం ప్రసిద్ధి అని అన్నారు. వరల్డ్ నెంబర్ 2 ఛాంపియన్ షిప్ కైవసం చేసుకున్న దయాల రవీందర్ గౌడ్ భీంగల్ కు చెందిన క్యారం ప్లేయర్ కావడం గర్వకారణం అని అన్నారు.
క్యారం క్రీడకు ప్రభుత్వాలు సముచిత స్థానాన్నిచ్చి ప్రోత్సహించాలని కోరారు. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇవ్వడం అభినందనీయం అని కంకణాల రాజేశ్వర్ అన్నారు. అఖిల భారత స్థాయిలో కూడా తమ ప్రత్యేక ప్రతిభా ప్రావీణ్యాన్ని ప్రదర్శించి తెలంగాణ సత్తాను చాటాలని ఈ సందర్భంగా కంకణాల రాజేశ్వర్ సూచించారు.