కామారెడ్డి, ఫిబ్రవరి 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
కామారెడ్డి పట్టణంలో నిరంతర పారిశుధ్య నిర్వహణ కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శుక్రవారం కామారెడ్డి పట్టణంలోని విద్యానగర్, వార్డు నేం 12, రామారెడ్డి బై పాస్ ప్రాంతాల్లో కలెక్టర్ పర్యటించి మున్సిపల్ అధికారులకు పలు ఆదేశాలు జారీచేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఇంటింటి చెత్త సేకరణ ప్రతీరోజూ నిర్వహిస్తే వీధుల్లో గృహిణులు చెత్త వేయరని, ప్రతీరోజూ ప్రతీ ఇంటి నుండి తడి పొడి చెత్తను మున్సిపల్ పారిశుధ్య సిబ్బంది సేకరించాలని అన్నారు. రోడ్లపై వేయకుండా చెత్త బుట్టలో వేసే విధంగా అవగాహన కల్పించాలని, ప్రచారం నిర్వహించాలని సూచించారు. మున్సిపల్ ఆధీనంలోని ఖాళీ స్థలాలు ఆక్రమణకు గురికాకుండా ఆయా వార్డు అధికారులు, మున్సిపల్ అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు.

ఇంటింటి నుండి సేకరించిన చెత్త్తను డంపింగ్ యార్డుకు తరలించాలని, సేగ్రిగేషన్ చేయాలని తెలిపారు. దుకాణ సముదాయల్లోని చెత్తను ప్రతీరోజూ సేకరించాలని, రోడ్డు పై చెత్త వేసే వారికి మొదట అవగాహన కల్పించాలని, ఆ తదుపరి కూడా చెత్తను రోడ్లపై వేస్తే మున్సిపల్ యాక్ట్ ప్రకారంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. రోడ్లకు ఇరువైపులా ఉన్న నాలీల్లోని చెత్తను తొలగించాలని తెలిపారు. దోమలు వ్యాప్తి చెందకుండా చూడాలని, నాలీల్లో చెత్త వేయకుండా ప్రజలకు తెలియపరచాలని అన్నారు. మున్సిపల్ టాక్స్ వసూలు చేయాలనీ, ఏరియర్స్ తో సహా వసూలు చేయాలనీ తెలిపారు.
కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ రాజేందర్ రెడ్డి, డిప్యూటీ ఈ ఈ వేణుగోపాల్, ఏఈఈ శంకర్, శానిటరీ ఇన్స్పెక్టర్, తదితరులు ఉన్నారు.