కామారెడ్డి, ఫిబ్రవరి 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
జిల్లాలోని గ్రామాలు వచ్చే వేసవి కాలంలో త్రాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శుక్రవారం తన కార్యాలయ ఛాంబర్ లో మిషన్ భగీరథ ఇంజనీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వచ్చే వేసవి కాలం ను దృష్టిలో ఉంచుకొని గ్రామ పంచాయతీ సిబ్బంది గ్రామాల్లోని నీటి వనరులను మరమ్మత్తులు చేసి వాడుకలోకి తీసుకురావాలని తెలిపారు. అత్యవసర పరిస్థితులలో ఆయా గ్రామ పంచాయతీ ట్రాక్టర్ లను శుభ్రమైన స్థితిలో సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు. మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీలు సత్వరమే గుర్తించి గ్రామ పంచాయతీ సిబ్బంది ఎప్పటికప్పుడు అరికట్టాలని ఆదేశాలు జారీచేయడం జరిగిందని తెలిపారు.
ప్రతీ మండలంలో లేకేజీలను ఆరికట్టడానికి తగిన సిబ్బందిని అందుబాటులో ఉంచుకోవాలనీ తెలిపారు. వేసవి కాలం దృష్ట్యా నీటి వృధాను అరికట్టాలని ప్రజలకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసారు. మిషన్ భగీరథ నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడినపుడు గ్రామ పంచాయతీ ఇతర వనరులను వినియోగించుకోవాలని తెలిపారు.
మండల అధికారులు, మిషన్ భగీరథ ఇంజనీర్లు సమన్వయంతో పనిచేస్తూ వేసవి కాలంలో నీటి సమస్యలు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మంచినీటి సరఫరాలో సమస్యలు తలెత్తినపుడు టోల్ ఫ్రీ నెంబర్ 1800 599 4007 కు తెలియజేయాలని అన్నారు. సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
సమావేశంలో మిషన్ భగీరథ నిజామాబాద్ సర్కిల్ ఎస్‌ఈ కే.రాజేంద్ర కుమార్, బాన్సువాడ ఆర్మూర్ మిషన్ భగీరథ గ్రిడ్ ఈఈ లు స్వప్న, నరేష్, మిషన్ భగీరథ కామారెడ్డి ఇంట్రా ఈఈ డి.రమేష్ లు పాల్గొన్నారు.