నిజామాబాద్, ఫిబ్రవరి 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
బోధన్ పట్టణంలో కొనసాగుతున్న ఎడపల్లి మహాత్మా జ్యోతిబాపూలే వెనుకబడిన తరగతుల బాలుర సంక్షేమ పాఠశాలలో కలెక్టర్ గురువారం రాత్రి బస చేశారు. పాఠశాలను ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్, విద్యార్థుల స్టడీ అవర్స్ కొనసాగుతుండడాన్ని గమనించారు. విద్యార్థులకు అందిస్తున్న భోజన, వసతి సదుపాయాలు, విద్యా బోధన, రోజువారీ దినచర్య, మెనూ తదితర వివరాలను పాఠశాల ప్రిన్సిపాల్ జైపాల్ ను అడిగి తెలుసుకున్నారు.

స్టడీ అవర్స్ కొనసాగుతున్న గదులను సందర్శించి విద్యార్థులతో కలెక్టర్ భేటీ అయ్యారు. పదవ తరగతి, ఇంటర్ విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి వారి సామర్ధ్యాన్ని పరిశీలించారు. ప్రభుత్వ పరంగా వారికి అందించిన పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్కులు, ఇతర వసతులను పరిశీలించారు. అన్ని తరగతి గదులను, డార్మెటరీ, కిచెన్, డైనింగ్ హాల్ తదితర వాటిని సందర్శించి అందుబాటులో ఉన్న సదుపాయాల పరిశీలన జరిపారు.
స్టోర్ రూమ్ లో నిలువ ఉంచిన సరుకుల నాణ్యతను తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి పాఠశాలలోనే కలెక్టర్ నిద్రించారు. కలెక్టర్ వెంట బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, ఆర్.సీ. ఓ సత్యనాథ్ రెడ్డి, తహసీల్దార్ విఠల్ తదితరులు ఉన్నారు.