ఆర్మూర్, ఫిబ్రవరి 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలో శుక్రవారం యోగా కార్యక్రమాన్ని నిర్వహించినట్టు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ చంద్రక ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమానికి ఆదియోగ పరమేశ్వర యోగ ఫౌండేషన్ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు, యోగ ఇన్స్ట్రక్టర్ డి. గంగాధర్ కళాశాలకు విచ్చేసి విద్యార్థులకు యోగ యొక్క ప్రాధాన్యం గురించి వివరించారు.
ప్రతినిత్యం యోగాసనాలు వేయడం వల్ల ఆరోగ్యంతో పాటు శారీరక దృఢత్వం, మానసిక దృఢత్వం కలుగుతాయని వివరించారు. సరైన ఆహారం తీసుకుంటూ సరైన వేళలో నిద్రపోవాలని మన ఆహారపు అలవాట్లతో పాటు ప్రతినిత్యం వివిధ రకాల యోగాసనాలు వేయడం వల్ల ఎలాంటి వ్యాధుల బారిన పడకుండా సంపూర్ణ ఆరోగ్యంతో జీవించవచ్చని తెలిపారు.
ఇటీవల కాలంలో యువత నిద్రలేమి, ఒత్తిడి సమస్యలతో బాధపడుతూ అనేక రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని వీటన్నిటిని దూరం చేసుకోవడానికి యోగ ఒక మంచి సాధనం అని తెలిపారు. విద్యార్థులకు అనేక రకాల యోగాసనాలు వేసి చూపించడమే కాకుండా వాటి ప్రాధాన్యం గురించి వివరించారు. ప్రతిరోజు విద్యార్థులు క్రమం తప్పకుండా యోగాసనాలు వేయాలని సూచించారు.
విద్యార్థుల నుంచి సానుకూల స్పందన రావడం చూసి యోగా ఇన్స్పెక్టర్ డి. గంగాధర్ సంతోషించి కళాశాలలో మరిన్ని యోగ కార్యక్రమాలు అందించడానికి ముందుంటానని తెలిపారు. ఈ కార్యక్రమం వృక్ష మరియు జంతు శాస్త్ర విభాగం వారి ఆధ్వర్యంలో నిర్వహించారు.

కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డా.ఎస్ .చంద్రిక ,వైస్ ప్రిన్సిపాల్ డా. ఎన్ .సుజాత అధ్యాపకులు చైతన్య శాంతి ,డా. శిరీష ఉజ్మా నిషాత్, వైష్ణవి, అధ్యాపకులు- విద్యార్థులు పాల్గొన్నారు.