నిజామాబాద్, ఫిబ్రవరి 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో గర్భస్తపూర్వ గర్భస్థ పిండా లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టంపై జిల్లా స్థాయి అడ్వైజరీ కమిటీ సమావేశము శుక్రవారం డిఎంహెచ్‌ఓ డాక్టర్ బి రాజశ్రీ అధ్యక్షతన డిఎంహెచ్‌ఓ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారిని మాట్లాడుతూ జిల్లాలో స్కానింగ్ సెంటర్ల రిజిస్ట్రేషన్ అన్ని ప్రమాణాలు పాటిస్తూ అర్హతలు ఉన్న స్కానింగ్ కేంద్రాలకు మాత్రమే రిజిస్ట్రేషన్, రెన్యువల్ చేయడం జరుగుతుంది అన్నారు. అదేవిధంగా ఏ స్కానింగ్ కేంద్రంలో అయినా గర్భిణీ స్త్రీలకు స్కానింగ్ చేసిన తర్వాత పుట్టబోయే శిశువు ఆడ లేదా మగా అని తెలియజేస్తే పిసిపిఎన్డిటి చట్టం ప్రకారం వారిపై చర్యలు తీసుకోబడుతాయన్నారు.
మెడికల్ షాపుల్లో ఆబార్షన్ కొరకు వాడే ఔషధాలను క్వాలిఫైడ్ డాక్టర్ రిఫరల్ స్లిప్పు లేనిదే అమ్మ రాదని తెలిపారు. జిల్లాలో ఉన్న స్కానింగ్ కేంద్రాలన్నీ రికార్డులను, రిపోర్టులను క్రమం తప్పకుండా నమోదు చేయాలని, లేనిచో వారికి రిజిస్ట్రేషన్ కానీ, రినెవల్స్ కానీ చేయడం జరగదు అన్నారు. అదేవిధంగా జిల్లాలో విస్తృతంగా అవగాహన సదస్సులను పిసిపి ఎన్డిటి చట్టంపై , బ్రూన హత్యలపై, ఆడపిల్ల ప్రాధాన్యతపై, బేటి బచావో బేటి పడాఓ పై, పాఠశాలల్లో, కళాశాలల్లో, గ్రామ మండల స్థాయి సమాఖ్య సమావేశాలలో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో జరిగే అమ్మ ఒడి కార్యక్రమాల్లో, నెలవారి సమావేశాల్లో, ఆశాలు గృహ సందర్శనలో ,ఐకెపి, మెప్మా ,డిఆర్డిఏ నెలవారి సమావేశాలలో వివిధ శాఖల సమన్వయంతో విస్తృతంగా అవగాహన కలిగించాలన్నారు.
సమావేశంలో నూతనంగా స్కానింగ్ సెంటర్ రిజిస్ట్రేషన్ కోసం ఒక దరఖాస్తు, స్కానింగ్ సెంటర్ రెన్యువల్ కోసం రెండు దరఖాస్తులు రావడం జరిగింది అన్నారు. ఇంకా సమావేశంలో రేడియాలజిస్ట్ డాక్టర్ ద్వితీ, పిల్లల వైద్యులు డాక్టర్ పి ప్రసన్న, గైనకాలజిస్ట్ డాక్టర్ బి బిందు, ప్రోగ్రాం అధికారి డాక్టర్ సుప్రియ, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు రాధా, ఆరోగ్య చైతన్య వేదిక నుండి ఘన్పూర్ వెంకటేశ్వర్లు, మెప్మా నుండి మాధురి,డెమో నాగలక్ష్మి, డిహెచ్‌ఈ జి వేణుగోపాల్ ,దేవేందర్ హాజరైనారు.