నిజామాబాద్, ఫిబ్రవరి 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలతో కూడిన కరీంనగర్ శాసన మండలి ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికల పోలింగ్ ప్రక్రియను నిజామాబాద్ జిల్లాలో పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు వెల్లడిరచారు.
శుక్రవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి, ఇతర ముఖ్య ఎన్నికల అధికారులు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ ఏర్పాట్లపై జిల్లా ఎన్నికల అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ లు అంకిత్, కిరణ్ కుమార్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో తదితరులు సమీకృత జిల్లా సముదాయాల కార్యాలయం వీ.సీ హాల్ నుంచి పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నిర్వహణ, ఓటరు సమాచార స్లిప్పుల పంపిణీ, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల ఏర్పాటు, కరీంనగర్లోని రిసెప్షన్ సెంటర్ కు బ్యాలెట్ బాక్సుల తరలింపు, పోస్టల్ బ్యాలెట్, వెబ్ క్యాస్టింగ్ ఏర్పాట్లు, పోలింగ్ కేంద్రాలలో వసతులు, పోలీసు బందోబస్తు, ఓటరు ఫెసిలిటేషన్ సెంటర్లు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు, నిఘా బృందాల పనితీరు పర్యవేక్షణ తదితర అంశాలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, సంబంధిత జిల్లాల కలెక్టర్లకు కీలక సూచనలు చేశారు.
వీడియో సమావేశం అనంతరం కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులతో మాట్లాడుతూ, ఈ.సీ మార్గదర్శకాల ప్రకారం ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నిర్వహణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలింగ్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో సందర్శించి సదుపాయాలను సరిచూసుకోవాలని అన్నారు. షామియానాలు, తాగునీరు, వీల్ చైర్ వంటి వసతులతో పాటు, ప్రతి పోలింగ్ స్టేషన్లో వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలన్నారు. పోలింగ్ ఏర్పాట్లపై చేపట్టిన చర్యల గురించి రాజకీయ పార్టీలకు, అభ్యర్థులకు సమాచారం అందించాలని, సైలెన్స్ పీరియడ్ లో పాటించాల్సిన నిబంధనలు అమలయ్యేలా చూడాలన్నారు.
పోలింగ్ నిర్వహణలో భాగంగా డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను కట్టుదిట్టంగా ఏర్పాటు చేయాలని, విధులు నిర్వహించే పోలింగ్ సిబ్బందికి అవసరమైన సదుపాయాలు కల్పించాలని సూచించారు. ఓటింగ్ ప్రక్రియ పూర్తయిన అనంతరం పోలింగ్ కేంద్రాల నుంచి బ్యాలెట్ బాక్సులను కట్టుదిట్టమైన భద్రత నడుమ కరీంనగర్ లోని రిసెప్షన్ సెంటర్ కు తరలించాలని సూచించారు. బ్యాలెట్ పత్రాలు దెబ్బతినకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.

బ్యాలెట్ బాక్సులను, మెటీరియల్ ను పీ.ఓ, ఏ.పీ.ఓలు తమ వెంట కరీంనగర్ రిసెప్షన్ సెంటర్ కు చేర్చాల్సి ఉంటుందని, వారితో పాటు సూక్ష్మ పరిశీలకులు కూడా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బ్యాలెట్ బాక్సుల తరలింపు కోసం అవసరమైన వాహనాలను సిద్ధం చేయాలని, పోలీసు బందోబస్తు మధ్యన వాటిని తరలించాలని, సెక్టోరల్ అధికారులు క్రియాశీలక పాత్ర పోషించాలన్నారు.
పోలింగ్ సిబ్బంది సకాలంలో పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలని, ఓటింగ్ పూర్తి పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో సజావుగా జరిగేవిధంగా జాగరూకతతో విధులు నిర్వహించాలని హితవు పలికారు. పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ జరపాలని, ఆయా పోలింగ్ కేంద్రాలలో కొనసాగే ఓటింగ్ ప్రక్రియను నిశితంగా పర్యవేక్షించాలని అన్నారు. పోలింగ్ ముగిసిన మీదట సాధ్యమైనంత త్వరగా బ్యాలెట్ బాక్సులను కరీంనగర్ లోని రిసెప్షన్ సెంటర్ కు చేర్చేలా ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని అన్నారు.
వీడియో కాన్ఫరెన్స్‌లో ఆర్డీఓలు రాజేంద్రకుమార్, రాజాగౌడ్, అదనపు డీసీపీ కె.రామచంద్రారావు, ఏ.సీ.పీ రాజవెంకటరెడ్డి, డీటీడబ్ల్యుఓ నాగూరావు, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.