నిజామాబాద్, ఫిబ్రవరి 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ప్రస్తుత సమాజంలో మాదకద్రవ్యాల వల్ల ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయని ఎంతోమంది విద్యార్థులు యువతి యువకులు తమయొక్క జీవితాలను చేతులారా నాశనం చేసుకుంటున్నారని అలాంటి స్థితి నుంచి వీలైనంత తొందరగా సమాజాన్ని కాపాడవలసిన బాధ్యత మన అందరి మీద ఉంటుందని అందుకోసము మాదక ద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాల మీద అవగాహన విద్యార్థి దశ నుంచే ప్రారంభం కావాలని ప్రతి ఒక్కరూ ఈ విషయంలో జాగ్రత్త వహించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని రాజశ్రీ సూచించారు.
నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై రెండు రోజులుగా నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆవిడ మాట్లాడుతూ కొంతమంది తమ యొక్క సంపాదన కోసము ఇతర అనైతిక వ్యవహారాల కోసం అమాయకులైన ఎంతో మందికి మాదక ద్రవ్యాలను అలవాటు చేసి వాటికి బానిసలుగా మారుస్తున్నారని అలాంటి వారిని గుర్తించి పోలీసులకు సమాచారం అందించాలని అంతేకాకుండా మన చుట్టూ ఉన్న వారిలో ఎవరైనా మాదక ద్రవ్యాలకు బానిసగా మారితే వారిని వెంటనే డి అడిక్షన్ సెంటర్లకు పంపించాలని మాదకద్రవ్యాల నిర్మూలన కోసము ప్రభుత్వము ఎంతో విశేషంగా కృషి చేస్తున్నదని ఆమె తెలిపారు.
చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు అందరికీ ఏదో ఒక రూపంలో మాదకద్రవ్యాలను అలవాటుగా మార్చే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయని వాటన్నింటి నుంచి సమాజాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంటుందని వారు గుర్తు చేశారు.
రెండు రోజుల శిక్షణ కార్యక్రమంలో ప్రముఖ మానసిక వైద్యులు డాక్టర్ విశాల్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ డాక్టర్ నాగరాజు, మల్లేష్, ఎక్సైజ్ ఎస్సై వెంకటేశ్వర్లు, సుధాకర్ వివిధ సెషన్లలో బాధకద్రవ్యాల నిర్మూలన మీద యువతి యువకులకు అవగాహన కల్పించారు.
కామారెడ్డి నిజామాబాదు జిల్లాల నుంచి ఎంపిక చేయబడిన 25 మంది యువతీ యువకులకు రెండు రోజులు పాటు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు జిల్లా యువజన అధికారిని శైలి బెల్లాల్ తెలిపారు, శిక్షణ పొందిన యువతి యువకులు తమ తమ ప్రాంతాలలో మాదకద్రవ్యాల నిర్మూలన కోసము అవగాహన కరపత్రాల పంపిణీ, ఇతర కార్యక్రమాల నిర్వహణలో ప్రభుత్వ శాఖలతో కలిసి పని చేస్తారని ఈ సందర్భంగా వారు తెలిపారు.
కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది, ఎక్సైజ్ సిబ్బంది, నెహ్రూ యువ కేంద్ర సిబ్బంది, యువజన సంఘాల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.