నిజామాబాద్, ఫిబ్రవరి 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాలతో కూడిన శాసన మండలి ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలను పురస్కరించుకుని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శనివారం జక్రాన్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. పోలింగ్ స్టేషన్లలో అందుబాటులో ఉన్న వసతులను తనిఖీ చేశారు. ర్యాంప్, టాయిలెట్స్, విద్యుత్ సరఫరా, నీటి వసతి ఇత్యాది సదుపాయాలను పరిశీలించారు.

ఈ నెల 27న పోలింగ్ ప్రక్రియ కొనసాగనున్న దృష్ట్యా పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా ప్రశాంత వాతావరణంలో సాఫీగా పోలింగ్ జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు. ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాలకు వేర్వేరుగా పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయగా, వాటి క్రమసంఖ్య, ఇతర వివరాలు సక్రమంగా ఉన్నాయా లేవా అని పరిశీలించారు. పాఠశాలలోని కిచెన్, తరగతి గదులను తనిఖీ చేశారు.
అంతకుముందు కలెక్టర్ ఆర్మూర్ మండలం మునిపల్లి లోని మహాత్మా జ్యోతిబాపూలే మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కిచెన్, డైనింగ్ హాల్, స్టోర్ రూం లను పరిశీలించి సదుపాయాలను గమనించారు. బియ్యం నిల్వలు, కూరగాయల నాణ్యత, సరుకుల స్టాక్ ను పరిశీలించారు. కాగా, బియ్యం బస్తాలకు ట్యాగ్ లేకపోవడాన్ని గుర్తించిన కలెక్టర్, ఎంఎల్‌ఎస్ పాయింట్ల ద్వారా కేటాయించబడే ప్రతి రైస్ బ్యాగ్ కు తప్పనిసరిగా ట్యాగ్ ఉండేలా చర్యలు తీసుకోవాలని సివిల్ సప్లైస్ డీ.ఎం ను ఫోన్ ద్వారా ఆదేశించారు.
ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలు, రెసిడెన్షియల్ విద్యాలయాలకు నాణ్యమైన సన్న బియ్యం సరఫరా చేసేలా పర్యవేక్షణ జరపాలన్నారు. న్యూ డైట్ మెనూ పట్టికను పరిశీలించి, విద్యార్థినులకు మెనూ ప్రకారం అల్పాహారం, భోజనం అందిస్తున్నారా అని ఆరా తీశారు. కలెక్టర్ వెంట స్థానిక అధికారులు ఉన్నారు.