కామారెడ్డి, ఫిబ్రవరి 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
రంజాన్ ఉపవాస దీక్షల నేపథ్యంలో ప్రభుత్వ పరంగా చేపట్టే సౌకర్యాలను ముందస్తు ఏర్పాట్లతో సమన్వయంతో చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శనివారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో ఎస్పీ తో కలిసి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రంజాన్ మాసం ఉపవాస దీక్షలు మార్చి 2 నుండి ప్రారంభం సందర్భంగా త్రాగునీరు, శానిటేషన్, నిరంతర విద్యుత్ సరఫరా, వీధి లైట్లు, తదితర ఏర్పాట్లు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
గ్రామాలు, పట్టణాల్లో పారిశుధ్య కార్యక్రమాలను నిరంతరం నిర్వహించాలని, త్రాగు నీటి సమస్య తలెత్తకుండా నీటిని సరఫరా చేయాలని మిషన్ భగీరథ, మున్సిపల్ అధికారులను ఆదేశించారు. బోర్లు, పైప్ లైన్ మరమ్మతులు ఉంటే ముందస్తుగా చేపట్టాలని తెలిపారు. ప్రతీ సంవత్సరం చేసే విధంగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. అదనపు నీటి సరఫరాకు చర్యలు చేపట్టాలని మిషన్ భగీరథ అధికారులకు తెలిపారు.
నమాజ్ సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగకుండా ఏర్పాట్లు చేయాలని విద్యుత్ శాఖ ఎస్‌ఈ కి సూచించారు. రంజాన్ పండగ నేపథ్యంలో అదనంగా అవసరాల మేరకు పాల సరఫరాల అయ్యే విధంగా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. వంటగ్యాస్ అందుబాటులో ఉంచాలని, ప్రభుత్వ ఆదేశాల మేరకు చక్కెర అదనపు కోటా సరఫరా చేయాలని పౌర సరఫరాల అధికారులకు తెలిపారు.
ఎస్పీ సింధు శర్మ మాట్లాడుతూ, జిల్లాలోని మసీదుల వద్ద శాంతి భద్రతలను పోలీసు యంత్రాంగం పర్యవేక్షిస్తుందనీ తెలిపారు. పండుగ నేపథ్యంలో పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉంటుందని తెలిపారు. సుహృత్ భావంతో పండుగను నిర్వహించుకోవాలని తెలిపారు. మత పెద్దలు మాట్లాడుతూ, తెల్లవారు జామున ప్రార్థన సమయానికి ముందే నీటి సరఫరా చేయాలనీ కోరారు. మసీదుల వద్ద షేడ్ నెట్‌లను, వీడిలైట్‌లను ఏర్పాటుచేయాలని కోరారు. పండుగ సామానులు కొనుగోలుకు రాత్రి వేళల్లో దుకాణాలు ఉండే విధంగా చూడాలని తెలిపారు.
సమావేశంలో సబ్ కలెక్టర్ కిరణ్మయి, అదనపు ఎస్పి చైతన్య రెడ్డి, అదనపు కలెక్టర్లు వి.విక్టర్, శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీఓ ప్రభాకర్, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి దేవేందర్, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.