నిజామాబాద్, ఫిబ్రవరి 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
విపత్తులు సంభవించిన సమయాల్లో తక్షణ సహాయక చర్యలు చేపట్టేందుకు వీలుగా ఆపద మిత్ర వాలంటీర్లకు అందిస్తున్న మొదటి విడత శిక్షణ శనివారం ముగిసింది. 300 మంది వాలంటీర్లను మూడు బ్యాచ్ లుగా విభజించి 19 రోజుల పాటు వివిధ శాఖల నిపుణులు, స్వచ్చంధ సంస్థల ద్వారా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలనే అంశాలపై ప్రయోగాత్మక శిక్షణ అందించారు.
మూడు బ్యాచ్‌ల వాలంటీర్లు మొదటి దఫా శిక్షణ పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లా కేంద్రంలోని న్యాక్ భవనంలో ఏర్పాటు చేసిన ముగింపు కార్యక్రమానికి అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి వాలంటీర్లను అభినందించారు. మరో రెండు దఫాలుగా వీరికి శిక్షణ అందించి, సుశిక్షితులైన సైనికుల వలే తర్ఫీదు ఇవ్వడం జరుగుతుందన్నారు. తొలి విడత శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న ఆపదమిత్ర వాలంటీర్లకు త్వరలోనే గుర్తింపు కార్డు, సర్టిఫికెట్ లను అందజేస్తామని అన్నారు.
మిగితా రెండు దఫాల శిక్షణ కూడా పూర్తి చేసుకున్న వారికి ఐదు లక్షల ప్రమాద బీమా సదుపాయాన్ని వర్తింపజేస్తారని, సుమారు 10వేల రూపాయల విలువ చేసే విపత్తు నివారణ సహాయ ఉపకరణాలతో కూడిన కిట్ అందజేస్తారని తెలిపారు. విపత్తులు సంభవించిన సమయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆస్తి, ప్రాణ నష్టాన్ని ఎలా నివారించాలి, అత్యవసర సమయాలలో ప్రాథమిక చికిత్స పద్ధతులు, సీ.పీ.ఆర్ చేసే విధానం, తదితర అంశాలపై ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బందితో పాటు ఆయా శాఖల ఆధ్వర్యంలో విజయవంతంగా మొదటి దఫా శిక్షణ పూర్తి చేయడం జరిగిందన్నారు.

శిక్షణ పూర్తి చేసుకున్న వాలంటీర్లు నేర్చుకున్న అంశాలను గుర్తుంచుకుని, విపత్తులు వాటిల్లిన సమయాల్లో సమర్ధవంతంగా సేవలు అందించాలని సూచించారు. కాగా, ఆపదమిత్ర వాలంటీర్ల శిక్షణ కార్యక్రమానికి సహకరించిన న్యాక్ అధికారులకు, శిక్షణ ఇచ్చిన సిబ్బందికి, ఏర్పాట్లు పర్యవేక్షించిన కలెక్టరేట్ సిబ్బందికి, తోడ్పాటును అందించిన అధికారులకు జిల్లా యంత్రాంగం తరపున అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టరేట్ విపత్తుల విభాగం పర్యవేక్షకులు శ్రీనివాస్ రావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.