నిజామాబాద్, ఫిబ్రవరి 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
నిజామాబాద్, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్ పూర్వ జిల్లాలతో కూడిన కరీంనగర్ నియోజకవర్గ పట్టభద్రుల శాసన మండలి ఎన్నికలలో పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించుకునేందుకు వీలుగా ఫారం-12 ద్వారా దరఖాస్తు చేసుకున్న వారి కోసం నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్) లోని ఎన్.ఐ.సీ హాల్ (రూమ్ నెంబర్ 21) లో ఓటరు ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేశామని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు.
పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలలో ఓటు హక్కు కలిగి ఉండి, ఎలక్షన్ డ్యూటీ కేటాయించబడిన ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఈ సదుపాయాన్ని కలిపించామన్నారు. ఈ నెల 25న (మంగళవారం) ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4.00 గంటల వరకు ఓటరు ఫెసిలిటేషన్ కేంద్రం ద్వారా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం వినియోగించుకోవచ్చని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ కు ఒక్క రోజు మాత్రమే అవకాశం కలిపించడం జరిగిందన్నారు.
ఎన్నికల విధులను కేటాయిస్తూ జారీ చేసిన డ్యూటీ ఆర్డర్ కాపీతో పాటు, ఎన్నికల సంఘం నిర్దేశించిన ఏదైనా ఒక గుర్తింపు కార్డును వెంట తీసుకుని వచ్చి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవచ్చని అన్నారు. పోస్టల్ బ్యాలెట్ కోసం ఫెసిలిటేషన్ సెంటర్లో పోలింగ్ బృందాన్ని నియమించడంతో పాటు అవసరమైన అన్ని ఏర్పాట్లను కల్పించడం జరిగిందన్నారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన వారు 235 మంది, ఇతర జిల్లాలకు చెందిన మరో 20 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కోరుతూ ఫారం-12 ద్వారా దరఖాస్తులు చేసుకున్నారని కలెక్టర్ వివరించారు.