నిజామాబాద్, ఫిబ్రవరి 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
నిజామాబాద్ జిల్లాకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా ప్రశ్నించే పీ.డీ.ఎస్.యూ. (పిడిఎస్‌యు) జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం.నరేందర్,డాక్టర్ కర్క గణేష్,జిల్లా కోశాధికారి నిఖిల్, సిపిఐ (ఎం.ఎల్) మాస్ లైన్ ఆర్మూర్ ఏరియా సబ్ డివిజన్ కార్యదర్శి కిషన్ లను ముందస్తు అరెస్టు చేశారు.
ఈ సందర్భంగా పి.వై.ఎల్.నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు సాయిబాబా మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ మరియు పార్లమెంటు ఎన్నికల సమయంలో నిజామాబాద్ జిల్లాకు విద్యారంగ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగిందనీ, ఇప్పటివరకు నిజామబాద్ జిల్లాకు సంబంధించిన విద్యారంగ సమస్య పరిష్కారం మాత్రం ఇప్పటికీ నోచుకోలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నిజామాబాద్ జిల్లాకు ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల మరియు ప్రభుత్వ బాలికల డిగ్రీ కళాశాలను మంజూరు చేసి నిజామాబాద్ ని విద్యా హబ్‌గా మారుస్తామని హామీ ఇవ్వడం జరిగిందనీ తెలిపారు.
నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ చెందిన పిసిసి అధ్యక్షులు, పార్టీ సలహాదారులు,మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ జిల్లా విద్యార్థుల ఆకాంక్షలను నెరవేర్చడంలో మాత్రం నిర్లక్ష్యం చేయడం బాధాకరమన్నారు. స్వయాన ముఖ్యమంత్రి విద్యాశాఖ సంబంధించిన అధికారాలు చూస్తున్నా గానీ ఇప్పటివరకు ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు, మెస్ బకాయలు చెల్లించకపోవడం విద్యారంగ సమస్యలు పరిష్కరించకపోవడం సిగ్గుచేటున్నారు. నిరుద్యోగ యువకుల సమస్యలు పరిష్కరించకుండా, ఉద్యోగాలు భర్తీ చేయకుండా ఇటువంటి అక్రమ అరెస్టులు చేయడం దుర్మార్గమన్నారు.