నిజామాబాద్, ఫిబ్రవరి 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఈ నెల 27న జరిగే శాసన మండలి ఎన్నికల పోలింగ్ కోసం నిజామాబాద్ జిల్లాలో అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియ కొనసాగేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని అన్నారు. శాసనమండలి పట్టభద్రుల నియోజవర్గానికి సంబంధించి జిల్లాలో 31,571 మంది ఓటర్లు ఉండగా, ఉపాధ్యాయ నియోజకవర్గ ఓటర్లు 3751 మంది ఉన్నారని వివరించారు.
ఈ మేరకు పట్టభద్రుల నియోజకవర్గానికి 48 పోలింగ్ కేంద్రాలను, ఉపాధ్యాయ సెగ్మెంట్ కు 33 పోలింగ్ కేంద్రాలను కలుపుకుని జిల్లాలో మట్టం 81 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు. 33 మండల కేంద్రాలతో పాటు మున్సిపల్ పట్టణాలలో ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా పోలింగ్ కేంద్రాలను అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. ఓటర్ల సౌలభ్యం కోసం ఉపాధ్యాయ, పట్టభద్రుల పోలింగ్ స్టేషన్లు దాదాపు ఒకే ప్రాంగణంలో ఉండేలా ఏర్పాటు చేశామని అన్నారు.
ప్రతి పోలింగ్ కేంద్రంలో ఒక పీ.ఓ, ఒక ఏ.పీ.ఓ, ఇద్దరు ఓ.పీ.ఓల చొప్పున నలుగురు అధికారులతో కూడిన బృందం పోలింగ్ ప్రక్రియను జరిపిస్తుందని తెలిపారు. 81 పోలింగ్ కేంద్రాలకు సరిపడా పోలింగ్ సిబ్బందిని నియమించడంతో పాటు మరో 20 శాతం అదనపు సిబ్బందిని కూడా రిజర్వ్ లో ఉంచామని, వీరికి పోలింగ్ ప్రక్రియ నిర్వహణపై మాస్టర్ ట్రైనర్లచే రెండు దఫాలుగా శిక్షణ అందించడం జరిగిందన్నారు. పోలింగ్ ప్రక్రియను సూక్ష్మ పరిశీలకులు నిశితంగా పరిశీలన జరిపేలా వారికి కూడా శిక్షణ అందించామన్నారు.
పోలింగ్ సిబ్బంది బ్యాలెట్ బాక్సులు, ఇతర ఓటింగ్ సామాగ్రితో వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు 26వ తేదీ సాయంత్రం లోపే చేరుకొని పోలింగ్ కోసం తగిన ఏర్పాట్లు చేసుకుంటారని తెలిపారు. ఈ మేరకు నిజామాబాద్, ఆర్మూర్ ఆర్డీఓ కార్యాలయాలు, బోధన్ సబ్ కలెక్టర్ ఆఫీసు ఆవరణలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్ సిబ్బంది అక్కడి నుండి బ్యాలెట్ బాక్సులు, సామాగ్రిని తీసుకుని సకాలంలో పోలింగ్ కేంద్రాలకు చేరుకునేలా రవాణా సౌకర్యం, ఇతర అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ తెలిపారు. పోలింగ్ ముగిసిన మీదట బ్యాలెట్ బాక్సులను కట్టుదిట్టమైన భద్రత నడుమ కరీంనగర్ లోని రిసెప్షన్ సెంటర్ కు చేర్చడం జరుగుతుందన్నారు.
ఎమ్మెల్సీ ఎలక్షన్ సందర్భంగా ఎన్నికల వ్యయ పరిమితి లేనప్పటికీ, ఎన్నికల నియమావళి తు.చ తప్పకుండా అమలయ్యేలా చర్యలు తీసుకున్నామని అన్నారు. 27న ఉదయం 8.00 గంటల నుండి సాయంత్రం 4.00 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుందని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు కలిగి ఉన్న ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా, స్వేచ్చాయుత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు.
కాగా, ఎన్నికల విధులు కేటాయించబడిన ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా మంగళవారం కలెక్టరేట్ లో ఓటరు సహాయక కేంద్రాన్ని ఏర్పాటు చేసి పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను జరిపించామని వివరించారు.