నిజామాబాద్, ఫిబ్రవరి 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
రంజాన్ మాసం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. కలెక్టర్ తన ఛాంబర్ లో మంగళవారం జిల్లా అధికారులతో సమావేశమై, రంజాన్ ఉపవాస దీక్షల సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లు, కల్పించాల్సిన సౌకర్యాలపై సమీక్ష జరిపారు.

ఎలాంటి ఇబ్బందులు, లోటుపాట్లకు తావులేకుండా జిల్లా వ్యాప్తంగా అన్ని పట్టణాలు, మండల కేంద్రాలు, గ్రామాలలో మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా సమన్వయంతో పని చేయాలని అధికారులకు సూచించారు. ప్రధానంగా ఎక్కడ కూడా తాగునీరు, పారిశుధ్యం వంటి సమస్యలు తలెత్తకుండా క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బందికి బాధ్యతలు పురమాయిస్తూ, నిరంతరం పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.
విద్యుత్ సరఫరాలో అంతరాయం అంతరాయం లేకుండా చూడాలని, వీధి లైట్ల మరమ్మతులు జరిపించాలన్నారు. బోర్లు, పైప్ లైన్ మరమ్మతులు ఉంటే ముందస్తుగా చేపట్టాలని తెలిపారు. అన్ని ప్రాంతాలకు నీటి సరఫరా జరిగేలా చర్యలు చేపట్టాలని మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు. ప్రార్థనా సమయాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని విద్యుత్ శాఖ ఎస్‌ఈ కి సూచించారు.
మసీదులు, ఈద్గాల వద్ద పారిశుధ్య సమస్య లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎక్కడ కూడా శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, సమస్యాత్మక ప్రాంతాలలో ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులకు సూచించారు. కాగా, వేసవి సీజన్ ప్రారంభం అవుతున్న దృష్ట్యా తాగునీటి సరఫరాకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని మిషన్ భగీరథ ఈ.ఈ రాకేష్ కు సూచించారు.
ఆయా జలాశయాలు, చెరువులలో అందుబాటులో ఉన్న నీటి నిల్వలు, ఎన్ని రోజుల వరకు తాగునీటి సరఫరా కోసం అవి సరిపోతాయి తదితర వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. జిల్లాలోని అన్ని నివాస ప్రాంతాలతో పాటు, అన్ని ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూల్స్, వసతి గృహాలకు రక్షిత మంచినీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
సమావేశంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, సబ్ కలెక్టర్ వికాస్ మహతో, అదనపు డీసీపీ బస్వారెడ్డి, జెడ్పి సీ.ఈ.ఓ సాయాగౌడ్, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, డీపీఓ శ్రీనివాస్, డీఎంహెచ్‌ఓ డాక్టర్ రాజశ్రీ, జిల్లా మైనారిటీ అధికారిణి కృష్ణవేణి, కార్మికశాఖ అధికారి యోహాన్, ఏ.సీ.పీలు రాజావెంకట్ రెడ్డి, శ్రీనివాస్, వెంకటేశ్వర్ రెడ్డి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.