నిజామాబాద్, ఫిబ్రవరి 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలతో కూడిన కరీంనగర్ శాసన మండలి ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికల పోలింగ్ నిర్వహణ కోసం సిబ్బందికి ఎన్నికల సామాగ్రి పంపిణీ నిమిత్తం ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను నిజామాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బుధవారం సందర్శించారు.
నిజామాబాద్ డివిజన్ కు సంబంధించి నిజామాబాద్ ఆర్డీఓ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఎన్నికల సామాగ్రి పంపిణీ తీరుతెన్నులను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. తాగునీటి వసతి, వైద్య శిబిరం, అల్పాహారం, భోజన వసతి, షామియానాలు ఇతర అన్ని వసతులు ఏర్పాటు చేయగా, పీ.ఓ, ఏ.పీ.ఓ, ఓ.పీ.ఓలతో కూడిన బృందాలన్నీ హాజరయ్యాయా లేదా అని కలెక్టర్ ఆరా తీశారు. బ్యాలెట్ పద్ధతి ద్వారా పోలింగ్ ప్రక్రియను జరిపించాల్సిన తీరు గురించి, వెంట తీసుకెళ్లాల్సిన బ్యాలెట్ పత్రాలు, పోలింగ్ సామాగ్రి గురించి ప్రయోగాత్మకంగా వివరిస్తున్న తీరును గమనించారు.
ఎలాంటి లోటుపాట్లు, గందరగోళానికి తావులేకుండా సిబ్బందికి పోలింగ్ సామాగ్రిని పక్కాగా అందించాలని, చెక్ లిస్టు ఆధారంగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామాగ్రి అందినదా, లేదా అన్నది జాగ్రత్తగా పరిశీలించుకోవాలని కలెక్టర్ హితవు పలికారు. పోలింగ్ సిబ్బందితో పాటు ఓటింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు నిర్వహించే పోలీసు సిబ్బందిని తరలించేందుకు సిద్ధంగా ఉంచిన ఆర్టీసీ బస్సులను పరిశీలించి, సకాలంలో నిర్దేశిత పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది చేరుకునేలా పర్యవేక్షణ జరపాలని అధికారులను ఆదేశించారు. పోలింగ్ సామాగ్రి పీ.ఎస్ లకు తీసుకెళ్తున్న సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే తమ దృష్టికి తేవాలని సూచించారు.
కాగా, జిల్లాలో 81 పోలింగ్ కేంద్రాలలో గురువారం ఉదయం 8.00 గంటల నుండి సాయంత్రం 4.00 గంటల వరకు ఓటింగ్ కొనసాగుతుందని కలెక్టర్ తెలిపారు. ఈ మేరకు నిజామాబాద్, ఆర్మూర్ ఆర్డీఓ కార్యాలయాలతో పాటు బోధన్ సబ్ కలెక్టర్ కార్యాలయ ఆవరణల్లో బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ సామాగ్రి పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేసి ఎన్నికల సిబ్బందికి పోలింగ్ సామాగ్రి అందించామని అన్నారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుండి సిబ్బంది తమకు కేటాయించిన వాహనాలలో నేరుగా పోలింగ్ స్టేషన్లకు చేరుకుని పోలింగ్ ప్రక్రియ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటారని తెలిపారు.

ప్రశాంత వాతావరణంలో పోలింగ్ కొనసాగేలా అన్ని చర్యలు తీసుకున్నామని అన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఉంటుందని, స్ట్రైకింగ్ ఫోర్స్, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తాయని తెలిపారు.
ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉన్న పోలింగ్ కేంద్రాలకు పీ.ఓ, ఏపీ.ఓ, ఇద్దరు ఓపీఓలతో పాటు అదనపు సిబ్బందిని నియమించామని కలెక్టర్ తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు కలిగి ఉన్న వారు ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. కలెక్టర్ వెంట నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్రకుమార్, ఇతర అధికారులు ఉన్నారు.