నిజామాబాద్, మార్చ్ 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
జిల్లాలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ బుధవారం తాగునీటి సరఫరా, ఆస్తి పన్ను, ప్లాట్ల క్రమబద్దీకరణ (ఎల్.ఆర్.ఎస్) రుసుము వసూళ్లు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు మార్కవుట్ చేయడం, రెసిడెన్షియల్ పాఠశాలలు, హాస్టళ్లలో కంప్లయింట్ బాక్సుల ఏర్పాటు, వాటి ద్వారా వచ్చే ఫిర్యాదులపై సత్వర చర్యలు చేపట్టడం తదితర అంశాలపై అదనపు కలెక్టర్ అంకిత్ తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష జరిపారు.
వేసవి సీజన్ ను దృష్టిలో పెట్టుకుని తాగునీటి సరఫరా వ్యవస్థను క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలన జరపాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలోని ఏ ఒక్క నివాస ప్రాంతంలోనూ నీటి ఎద్దడి రాకుండా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తూ, అవసరమైన చోట యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టాలని ఆదేశించారు. ఆయా గ్రామాల వారీగా నీటి సరఫరా పరిస్థితిని నిరంతరం సమీక్షించాలని, చేతి పంపులు, బోరు బావులకు అవసరమైన చోట తక్షణమే మరమ్మతులు జరిపించాలని, రెండు రోజుల్లో అన్ని చోట్లా మరమ్మతు పనులు పూర్తి కావాలని గడువు విధించారు.

స్థానికంగా ఉండే ప్లంబర్లు, బోరు మెకానిక్ లను గుర్తించాలని, మరమ్మతులు అవసరమైన సమయాలలో వారిని సంప్రదించి పనులు జరిపించాలన్నారు. మంచినీటి పథకాలకు విద్యుత్ సరఫరాలో అవాంతరాలు లేకుండా చూడాలని, పరీక్షల సీజన్ అయినందున హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్ళకు నీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. నివాస ప్రాంతాలతో పాటు అన్ని అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ విద్యా సంస్థలకు సమృద్ధిగా శుద్ధి జలాలు సరఫరా అయ్యేలా చూడాలన్నారు.
ప్రతి ఆవాసంలో ఒక్కో నివాస గృహం వారీగా శుద్ధి జలాలు అందేలా నీటి సరఫరా వ్యవస్థను చక్కదిద్దాలని, కుళాయిల బిగింపు ప్రక్రియను వెంటనే పూర్తి చేయించాలన్నారు. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపల్ పట్టణాలలో తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని, ఎక్కడైనా లోపాలను గుర్తిస్తే వెంటనే వాటిని సరిచేయాలన్నారు. వాటర్ ట్యాంకులను క్రమం తప్పకుండా శుభ్రం చేయించాలని, ఓపెన్ బావులను తప్పనిసరిగా క్లోరినేషన్ చేయించాలని ఆదేశించారు.
కాగా, ఆస్తి పన్ను, ప్లాట్ల క్రమబద్దీకరణ రుసుము వసూళ్లలో వేగం పెంచాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. నిర్ణీత గడువు లోపు పాత బకాయిలు సహా వంద శాతం పన్ను వసూలయ్యేలా చొరవ చూపాలన్నారు. పన్ను వసూళ్లలో పూర్తిగా వెనుకంజలో ఉన్న గ్రామ పంచాయతీల కార్యదర్శులపై చర్యలు తీసుకోవాలని డీ.ఎల్.పీ.ఓ లను ఆదేశించారు. ఎల్.ఆర్.ఎస్ క్రమబద్దీకరణ ఫీజును మార్చి నెలాఖరు లోపు చెల్లిస్తే 25 శాతం రిబేటు వర్తిస్తుందని తెలిపారు. ఈ విషయాన్ని ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తుదారులకు వివరిస్తూ, రిబేట్ సదుపాయం సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి లబ్ధిదారులు నిర్మాణాలు చేపట్టేలా మార్కవుట్ ప్రక్రియను త్వరితగతిన చేపట్టి, నిర్దేశిత ఆన్లైన్ యాప్ లో వివరాలు పొందుపర్చాలని సూచించారు. ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలు, సంక్షేమ వసతి గృహాలలో ఫిర్యాదు పెట్టెలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. వీటి ద్వారా వచ్చే ఫిర్యాదులను ప్రతి వారం పరిశీలిస్తూ, సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు.
వీడియో కాన్ఫరెన్స్ లో జెడ్పి సీఈఓ సాయాగౌడ్, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, డీపీఓ శ్రీనివాస్, ట్రాన్స్కో ఎస్.ఈ రవీందర్, జిల్లా వ్యవసాయ అధికారి వాజిద్ హుస్సేన్, ఆర్.డబ్ల్యూ.ఎస్ ఎస్.ఈ రాజేంద్రకుమార్, ఈ.ఈలు రాకేష్, స్వప్న, మున్సిపల్ కమిషనర్లు, మండల స్పెషల్ ఆఫీసర్లు, ఎంపీడీఓలు, ఎంపీఓలు, మిషన్ భగీరథ ఏ.ఈలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.