నిజామాబాద్, మార్చ్ 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
సమాజానికి పెను సవాలుగా మారిన మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాల నిరోధానికి సంబంధిత శాఖల అధికారులు కలిసికట్టుగా కృషి చేయాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో అదనపు కలెక్టర్ నేతృత్వంలో బుధవారం జిల్లా స్థాయి మాదకద్రవ్యాల నిరోధక కమిటీ సమావేశం జరిగింది. జిల్లాలో మాదకద్రవ్యాల వినియోగం, రవాణా తదితర అంశాలపై సమావేశంలో చర్చించి, వాటి నియంత్రణకు చేపట్టాల్సిన చర్యల గురించి పలు నిర్ణయాలు తీసుకున్నారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపేందుకు అధికారులు సమన్వయంతో మరింత గట్టిగా పని చేయాలని అన్నారు. మాదకద్రవ్యాల వినియోగం, రవాణాపై గట్టి నిఘా పెడుతూ, వాటిని పూర్తి స్థాయిలో అరికట్టేందుకు అంకితభావంతో కృషి చేయాలని హితవు పలికారు. ముఖ్యంగా రోడ్డు, రైలు మార్గాల ద్వారా వీటిని రవాణా చేసే అవకాశాలు ఉన్నందున ఆర్టీసీ, రైల్వే అధికారులు అవసరమైన చర్యలు చేపట్టాలని, తనిఖీ కేంద్రాల వద్ద గట్టి నిఘా ఉంచాలని అన్నారు.
గంజాయి వంటి మత్తు పదార్థాలు ఎక్కడి నుండి జిల్లాకు చేరుతున్నాయి, ఏయే ప్రాంతాల్లో ఎవరు వీటిని విక్రయిస్తున్నారు, ఏ ప్రాంతాలకు జిల్లా మీదుగా రవాణా జరుగుతోంది, స్థానికంగా ఎక్కడైనా గంజాయిని అంతర పంటగా సాగు చేస్తున్నారా అనే వివరాలకు పక్కాగా గుర్తిస్తూ, వాటి మూలాలను అడ్డుకోగలిగితే చాలా వరకు మత్తు పదార్థాల వినియోగాన్ని నియంత్రించవచ్చని సూచించారు. కల్తీ కల్లు తయారీ కోసం వినియోగించే అల్ఫ్రాజోలం నిల్వల గురించి ఆరా తీసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ దిశగా పోలీస్, ఎక్సయిజ్, రవాణా తదితర శాఖలు సమన్వయంతో ముందుకెళ్లాలని అదనపు కలెక్టర్ హితవు పలికారు.
సమావేశంలో అదనపు డీసీపీ బస్వారెడ్డి, ఎక్సయిజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి, డీఎంహెచ్‌ఓ డాక్టర్ రాజశ్రీ, వ్యవసాయ శాఖ అధికారి వాజిద్ హుస్సేన్, జిల్లా రవాణా శాఖ అధికారి ఉమామహేశ్వర్ రావు, అటవీ, వాణిజ్య పన్నులు, ఔషధ నియంత్రణ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.