నిజామాబాద్, మార్చ్ 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
కరీంనగర్, నిజామాబాద్, అదిలాబాద్, మెదక్ జిల్లాల ఉపాధ్యాయ నియోజవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజెపీ అభ్యర్థి మల్కా కొమురయ్య, పట్టభద్రుల నియోజకవర్గంలో ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్ని అంజిరెడ్డి గెలుపొందిన నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా బీజేపీ లీగల్ సెల్, న్యాయవాద పరిషత్ ఆధ్వర్యంలో జిల్లాకోర్టు చౌరస్తాలో టపాకాయలు కాల్చి, మిఠాయిలు పంచి సంబరాలు జరుపుకున్నారు.
ఈ సందర్భంగా పరిషత్ జిల్లా అధ్యక్షుడు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధ్యయ నిరుద్యోగ యువత పట్ల నిర్లక్ష్య వైఖరికి నిరసన వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉత్తర తెలంగాణ ప్రజలు తీర్పునిచ్చి భాజపా పై విశ్వాసం తెలియజేశారని అన్నారు. దేశ వ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో అమలవుతున్న ప్రగతి పథకాలు ప్రజలకు చేరువవతున్న తీరుకు స్పందించిన ప్రజలు భాజపాకు అనుకూలంగా సంఘటితం అవుతున్నారని తెలిపారు.
తెలంగాణలో ప్రజలు భాజపా పట్ల విశ్వాసాన్ని చూపారని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు భాజపా నాయకత్వంలో ఉన్నప్పుడే అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతాయని జగన్ పేర్కొన్నారు. దేశానికి నూతన జవసత్వాలు అందించి ప్రగతి పథకాలకు నూతన ఒరవడిని మోడీ తీర్చిదిద్దారని అభివర్ణించారు.
భాజపా కు అండదండలు అందించిన ఉపాధ్యాయ పట్టభద్రుల ఓటర్లందరికి ప్రజలకు జగన్ అభివాదాలు తెలియజేశారు. రాబోవు రోజులలో రాష్ట్రంలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో న్యాయవాదులు బిట్ల రవి, పిల్లి శ్రీకాంత్, విఘ్నేష్ పడిగేల వెంకటేశ్వర్, అంజలి, లక్మన్ రాజు,యాదగిరి, కేశవరావు, నారాయణ దాసు, అనిల్ వి మ్ మహేష్ దిలీప్ అవుల నారాయణ, చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.