ఆర్మూర్, మార్చ్ 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలో ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ చంద్రిక ఒక ప్రకటనలో తెలిపారు. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ విద్యార్థులు వివిధ రంగాలలో రాణించిన గొప్ప గొప్ప మహిళలను స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో డాక్టర్ పి ఎన్. పుష్పాంజలి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో రాణించాలని తెలిపారు. వైస్ ప్రిన్సిపాల్ డా. ఎన్. సుజాత మాట్లాడుతూ కేవలం విద్య ద్వారా మాత్రమే విద్యార్థులు అన్ని రంగాలలో రాణిస్తారని అదేవిధంగా మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే తమ కాళ్ళ మీద తాము నిలబడే అవకాశం ఉంటుందని తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గత ఆరువారాలుగా అనేక కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందన్నారు.
చిత్రలేఖనం ,పాటలు, నాటిక, సైన్స్ ప్రయోగాలు -ప్రదర్శన, మాక్ పార్లమెంట్ వంటి తదితర కార్యక్రమాలు నిర్వహించి వీటిలో ఉత్తమ ప్రతిభాపాటవాలు కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేయడం జరిగింది. విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో అందరినీ అలరించారు. విద్యార్థులు మహిళా దినోత్సవం సందర్భంగా ఉపన్యాసాల ద్వారా స్త్రీల గొప్పతనాన్ని వివరించి అందరిని ఆకట్టుకున్నారు.. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.