డిచ్‌పల్లి, మార్చ్ 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
తెలంగాణ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల ఆలోచనలు- అవకాశాలు అనే అంశంపై యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ప్రవీణ్ మామిడాల అధ్యక్షతన విస్తృతోపన్యాస కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అమెరికాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెసర్, అకాడమిక్ ఎడ్యుకేషన్ అడ్వైజర్ డాక్టర్ వాణి గడ్డం ప్రధాన వక్తగా హాజరై మాట్లాడారు.
విద్యార్థి జీవితంలో విజయం సాధించాలంటే నిరంతర అధ్యయనం బహుముఖ విజయాల పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. మారుతున్న పోటీ ప్రపంచంలో ఎదుర్కొని నిలబడేందుకు ప్రధానంగా విద్యార్థులలో ఆలోచనల్లో మార్పు రావాలన్నారు. విద్యార్థి దశ నుండి భిన్నమైన గమ్య స్థానాల పట్ల స్పష్టమైన అవగాహన కలిగి ఉండి దానిని సాధించేందుకు దార్శనికతతో ముందుకు పోవాలన్నారు.
వర్తమాన కాలంలో ఎదురయ్యే సవాళ్లకు సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ మానసిక వృద్ధితో, మనోధైర్యంతో ఎదుర్కొని భవిష్యత్తుకు మార్గం సుగమంచేసుకోవాలన్నారు.
అనేక విఫలమైన అనుభవాలను గుణపాఠాలుగా మార్చుకొని విజయం కొరకు అడుగులు వేయాలన్నారు. నిరంతర సాధన, అధ్యయనంతోనే ఇది నెరవేరుతుందని పేర్కొన్నారు.
కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని లక్ష్యసాధనకు అనేక ప్రశ్నలు అడిగి అనుమానాలను నివృత్తి చేసుకున్నారు. కార్యక్రమంలో లా కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ ప్రసన్న రాణి, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ హెడ్, డాక్టర్ నాగరాజు పాత, చీప్ వార్డెన్ డాక్టర్ మహేందర్ ఐలేని వివిధ విభాగాల అధ్యాపకులు పాల్గొన్నారు. అనంతరం డాక్టర్ వాణి గడ్డం ను విద్యార్థులు అధ్యాపకులు శాలువాతో సత్కరించారు.