చుక్కనీరు వృధా కాకుండా నీటి నిర్వహణ జరగాలి

కామారెడ్డి, మార్చ్‌ 10

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

రబీ పంటను కాపాడేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రివర్యులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావులు అన్నారు.

ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పంటలు ఎండి పోతున్నట్ల ఎక్కువగా చేసి చూపుతూ ప్రభుత్వానికి వ్యతిరేక వాతావరణం సృష్టించే ప్రయత్నం జరుగుతుందని అన్నారు. ఇరిగేషన్‌ చీఫ్‌ ఇంజనీర్లు, వ్యవసాయ అధికారుల నుంచి జిల్లా కలెక్టర్లు రిపోర్ట్‌ తీసుకుని విద్యుత్‌ శాఖ అధికారులతో కూడా సమన్వయం చేసుకుంటూ పంట నష్టం జరగకుండా, ఎండిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.

రాష్ట్రంలో కొంత నీటి కొరత ఉన్న నేపథ్యంలో నీటి సరఫరా సమర్థవంతంగా చేసేందుకు నీటిపారుదల శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పని చేయాలని అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 55 లక్షల ఎకరాలలో వరి పంట సాగు అవుతుందని అన్నారు. జిల్లా కలెక్టర్లు వ్యవసాయ శాఖ, ఇరిగేషన్‌, విద్యుత్‌ అధికారులతో సమన్వయం చేసుకుంటూ పంట నష్టాన్ని తగ్గించాలని మంత్రి ఆదేశించారు.

రాజకీయ దురుద్దేశాలతో ప్రస్తుత ఉన్న పరిస్థితిని ఎక్కువ చేసి చూపించిన, రబీ యాక్షన్‌ ప్లాన్‌లో లేని ప్రాంతాలలో పంటలు ఎండి పోతున్నట్లు వార్తలు వచ్చిన అధికారులు, కలెక్టర్‌లు వెంటనే స్పందించి ప్రజలకు వాస్తవాలు తెలిసేలా క్లారిటీ ఇవ్వాలని మంత్రి కోరారు. వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ 18 లక్షల ఎకరాలు వివిధ ప్రాజెక్టు కాల్వల క్రింద, 37 లక్షలు బోర్ల క్రింద వరి పంట సాగు అవుతుందని అన్నారు. దేవాదుల ప్రాజెక్టు వద్ద జనగాం, సూర్యాపేట, యాదాద్రి జిల్లాలో కొంత మేర ఇబ్బందులు ఉన్నాయని తెలిపారు.

రాబోయే 10 నుంచి 15 రోజులలో నీటి పారుదల శాఖ అధికారులతో అవసరమైన నీటి విడుదల కట్టుదిట్టంగా చేస్తూ పంటలను కాపాడే బాధ్యతను కలెక్టర్లు తీసుకోవాలని అన్నారు. ఆయకట్టు క్రింద కాలువల ద్వారా విడుదల చేసే నీటిలో ముందు టెయిల్‌ ఎండ్‌ ప్రాంతాలకు నీరు వచ్చేలా చూడాలని అన్నారు. నాగార్జున సాగర్‌ క్రింద ఒక ఎకరం కూడా ఎండి పోవడానికి వీలు లేదని మంత్రి సూచించారు.

పోలీసుల సహకారం తీసుకొని చివరి ఆయ కట్టుకు నీళ్లు చేరేలా చూడాలని మంత్రి తుమ్మల ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న సమయం చాలా కీలకమైందని, విద్యుత్‌ సరఫరా, పై ప్రాంతాల్లో నీరు వృధా కాకుండా చూడడం, అవసరమైన చోట పోలీసు బందోబస్తు తీసుకోవడం వంటి చర్యలు చేపట్టాలని మంత్రి తెలిపారు.

భూగర్భ జలాలు తగ్గిపోవడం, బోర్లు ఎండిపోవడం వల్ల ఎక్కడైనా సాగు నీటి ఇబ్బందులు ఉన్నవాటిని పరిశీలించాలని అన్నారు. పంట కోతలు వచ్చే వరకు వ్యవసాయ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఫీల్డ్‌ లెవల్‌ లో ఉంటూ స్థానిక పరిస్థితులను ఎప్పటికప్పుడు నీటిపారుదల శాఖ అధికారులకు, కలెక్టర్‌ దృష్టికి తీసుకుని రావాలని మంత్రి సూచించారు.

ఈ సందర్భంగా సీఎస్‌ శాంతి కుమారి మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎక్కడ విద్యుత్‌ సరఫరా సమస్యలు లేవని అన్నారు. జనగాం జిల్లాలో పంటలు కాపాడేందుకు మోటార్ల మరమ్మత్తులు పూర్తి చేసామని, సిద్దిపేట జిల్లాలో పంటల సంరక్షణకు రంగనాయక సాగర్‌ రిజర్వాయర్లు ఒకటిన్నర టీఎంసీలు విడుదల చేశామని తెలిపారు. ప్రాజెక్టు నుంచి విడుదల చేసిన ప్రతి నీటి చుక్కను పూర్తి స్థాయిలో వాడుతూ చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని, వార్తాపత్రికల్లో వచ్చే తప్పుడు వార్తలకు స్పందించడంతో పాటు, జిల్లాలో రైతులకు సాగునీరు అందించేందుకు తీసుకుంటున్న చర్యలు, సాగు అవుతున్న పంట వివరాలు, నీటి సరఫరా చేసి కాపాడిన పంట వివరాలు కూడా పత్రికల్లో ప్రచురించేలా చూడాలని సీఎస్‌ కలెక్టర్లకు సూచించారు.

వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అధికారులతో మాట్లాడుతూ, గత సంవత్సరం వేసవి సీజన్‌లో పంటల స్థితిగతులపై వివరాలు సమర్పించాలని వ్యవసాయ అధికారిని ఆదేశించారు.

సమావేశంలో అదనపు కలెక్టర్‌ వి.విక్టర్‌, జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్‌, ఇరిగేషన్‌ ఈఈ శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఘనంగా రామారావు మహారాజ్‌ విగ్రహ వార్షికోత్సవం

Print 🖨 PDF 📄 eBook 📱 బాన్సువాడ, మార్చ్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »