నిజామాబాద్, మార్చ్ 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
దర్పల్లి, సిరికొండ మండలాల్లోని ఆయా ప్రాంతాలలో ప్రస్తుత యాసంగిలో రైతులు సాగు చేస్తున్న వరి క్షేత్రాలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మంగళవారం పరిశీలించారు. బోరుబావుల కింద సాగవుతున్న వరి పైరు ఏ స్థితిలో ఉంది, సాగునీటి లభ్యత ఏ మేరకు అందుబాటులో ఉంది అన్న అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు.
దర్పల్లి మండలం చెరువుతండా శివారులో ఒడ్డేటి చిన్నసాయిలు, సిరికొండ మండలం పెద్దవాల్గోట్ శివారులో శోభన్ రాజు అనే రైతులకు చెందిన వరి పైర్లు పాక్షికంగా కొంత విస్తీర్ణంలో ఎండుముఖం పట్టడాన్ని గమనించిన కలెక్టర్, అందుకు గల కారణాల గురించి వ్యవసాయ అధికారులను, సంబంధిత రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

కేవలం బోరు బావులపైనే ఆధారపడి పంటలు వేసిన తరుణంలో ప్రస్తుతం భూగర్భ జలాలు అడుగంటిపోయి వరి పంటకు పూర్తి స్థాయిలో సాగు నీరు అందడం లేదని రైతులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. పై మండలాలలో ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో వరి పంట సాగు చేశారు, ఎంత విస్తీర్ణంలో పంట ఎండిపోయే దశకు చేరింది, మిగితా విస్తీర్ణంలో వరి పంట దిగుబడులు చేతికి వచ్చేందుకు ఇంకా ఎంత సమయం పడుతుంది, ఎన్ని తడులు నీరు అవసరం అవుతుంది, గతేడాది యాసంగిలో పంటల పరిస్థితి ఎలా ఉండిరది, ఏ రకం ధాన్యం సాగు చేస్తున్నారు తదితర వివరాలను కలెక్టర్ ఆరా తీశారు.
ఎండుముఖం పడుతున్న పంటలకు సాగు అందించేందుకు వీలుగా ఏవైనా ప్రత్యామ్నాయ మార్గాలు అందుబాటులో ఉంటే పరిశీలించాలని అధికారులకు సూచించారు.
కాగా, సాగునీటి విషయమై రైతుల్లో అవగాహన పెంపొందించాలని కలెక్టర్ వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. కనీసం వచ్చే యాసంగి సీజన్లో నైనా సాగునీరు వనరుల లభ్యతను బట్టి తగిన పంటలు వేసుకునేలా చైతన్యపరచాలని సూచించారు. ముఖ్యంగా బోరుబావులపైనే ఆధారపడి పంటలు పండిస్తున్న రైతులకు భూగర్భ జలాల పరిస్థితి గురించి వివరిస్తూ, రబీలో పూర్తి విస్తీర్ణంలో వరి పంట వేయకుండా ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకునేలా ప్రోత్సహించాలని అన్నారు.
అందుబాటులో ఉన్న నీటి వనరులను పొదుపుగా వినియోగించుకునేలా చూడాలని, క్షేత్రస్థాయిలో రైతులకు అందుబాటులో ఉంటూ వారికి అవసరమైన సలహాలు, సూచనలు అందించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వాజిద్ హుస్సేన్, ఏ.ఓలు బి.శ్రీనివాస్ రావు, వెంకటేష్, ఏ.ఈ.ఓ లక్ష్మిప్రసన్న, తహసీల్దార్ మాలతి తదితరులు ఉన్నారు.