నిజామాబాద్, మార్చ్ 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
చేతికొచ్చిన పంటను కాపాడడం రాష్ట్ర ప్రభుత్వ కర్తవ్యమని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖా మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. సాగునీటి విషయంలో అసత్య ప్రచారాలు ఎక్జువ అవుతున్నాయని, ఈ విషయంలో నీటిపారుదల శాఖాధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ వాస్తవాలను ప్రజలకు వివరించాలని సూచించారు.

సోమవారం సాయంత్రం డాక్టర్ బి.ఆర్.అంబెడ్కర్ సచివాలయం నుండి సహచర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, రాష్ట్ర వ్యవసాయ శాఖా కార్యదర్శి రఘునందన్ రావు టి.ఎస్.ఎస్.పి.డి.సి.ఎల్ సి.యం.డి ముషారఫ్ తదితరులతో కలసి రాష్ట్రంలోని ఆయా జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్.పి లు, వ్యవసాయ శాఖాధికారులు, విద్యుత్ శాఖాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రబీ సీజన్ పంట మరో 15 రోజుల్లో చేతికి రానున్నందున ఆయా జిల్లాల అధికారులు సమన్వయంతో కలసి క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ రైతాంగానికి తోడ్పాటు నందించాలని ఆయన సూచించారు. యాసంగి పంటకు సాగు నీరు చివరి ఆయకట్టు వరకు అందించేందుకు నీటిపారుదల శాఖాధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యుత్ సరఫరాలో ఇప్పటి వరకు ఎటువంటి అవాంతరాలు లేవని అన్నారు.
వ్యవసాయ శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, క్షేత్ర స్థాయిలో నిజనిజాలు తెలుసుకోకుండా పంట నష్టం గురించి జరుగుతున్న ప్రచారం సత్య దూరమన్నారు. ఇటువంటి విషయంలో అధికారులు తక్షణమే రంగంలోకి దిగి నివారణ చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదేశానుసారం రబీ పంట విషయంలో ప్రభుత్వ యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూనే వీడియో కాన్ఫరెన్స్ ల ద్వారా సమగ్ర సమాచారం తెప్పిస్తున్నామన్నారు.
అందులో భాగంగానే నీటిపారుదల శాఖతో సమన్వయం చేసుకుని అన్నపూర్ణ సాగర్ నుండి రంగనాయక సాగర్ కు 1.5 టి.యం.సి నీటిని విడుదల చేయడంతో పాటు పంప్ హౌజ్ ల మరమ్మతులు చేపట్టినట్లు ఆమె వివరించారు.
కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ, జిల్లాలో యాసంగి పంటల పరిస్థితిని నిరంతరం నిశితంగా పర్యవేక్షిస్తున్నామని అన్నారు. ముఖ్యంగా వరి పంట చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందేలా ప్రణాళికబద్ధంగా కృషి చేస్తున్నామని తెలిపారు. జిల్లాలో ప్రస్తుత యాసంగి సీజన్లో మొత్తం 4.19 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరి సాగు చేశారని కలెక్టర్ మంత్రుల దృష్టికి తెచ్చారు. ఇందులో 2.38లక్షల ఎకరాలు చెరువులు, కాలువల కింద ఆయకట్టు కలిగి ఉండడం వల్ల సాగు జలాలకు ఎలాంటి ఇబ్బందులు లేదని అన్నారు. బోరు బావుల పైన ఆధారపడి మరో లక్షా 80 వేల ఎకరాల విస్తీర్ణంలో వరి సాగు చేస్తున్నారని తెలిపారు.
భూగర్భ జలాలు కొంతమేర తగ్గడం వల్ల భీమ్గల్, ధర్పల్లి, సిరికొండ, ఇందల్వాయి, జక్రాన్పల్లి, డిచ్పల్లి మోపాల్ మండలాల్లో సుమారు 1100 ఎకరాలలో వరి పంటకు సాగునీటి కొరత నెలకొందని అన్నారు. పై ప్రాంతాలలోనూ ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సాగునీటిని అందించి పంటలు కాపాడుకునేలా అందుబాటులో ఉన్న అన్ని వనరులను సద్వినియోగం చేసుకుంటామని కలెక్టర్ తెలిపారు. వ్యవసాయ, నీటి పారుదల, విద్యుత్ తదితర శాఖల అధికారులను సమన్వయపర్చి, నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సాగునీటి సరఫరాను పర్యవేక్షించేలా చర్యలు తీసుకున్నామని అన్నారు. విడియో కాన్ఫరెన్స్‌లో సీ.పీ సాయి చైతన్య, అధికారులు పాల్గొన్నారు.