కామారెడ్డి, మార్చ్ 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
వేసవి కాలంలో వడదెబ్బ తగలకుండా ప్రతీ ఒక్కరు అప్రమత్తంగా ఉండేలా విస్తృత ప్రచారం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో వైద్యం, పంచాయతీ, మున్సిపల్, గ్రామీణాభివృద్ధి, తదితర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో వేసవి కాలంలో ప్రజలకు వడదెబ్బ తగలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకునేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.
ఎండ తీవ్రతకు అస్వస్థతకు గురయిన వాటిని వెంటనే ఆసుపత్రులకు తరలించి వైద్య సేవలు అందించాలని తెలిపారు. జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్లు, జనరల్ ఆసుపత్రులలో అవసరమైన మందులు, ముఖ్యంగా ఒ.ఆర్.ఎస్. పాకెట్ లు అందుబాటులో ఉంచాలని తెలిపారు. వేసవి కాలంలో చేయకూడనివి, చేయదలచినవి ప్రజలకు వివరించి విధంగా కరపత్రాలను ప్రచురించి పంపిణీ చేయాలని తెలిపారు.
గ్రామాలు, పట్టణాల్లో, ముఖ్యంగా ప్రజల రద్దీ ప్రాంతాలలో చలి వేంద్రాలు ఏర్పాటుచేయాలని, స్వచ్ఛంద సంస్థల సహకారంతో కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నిరంతర నీటి సరఫరా, పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. వేసవిలో ఆసుపత్రిలో అగ్ని ప్రమాదాలు జరుగకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని, ఆసుపత్రి సిబ్బందికి ఫైర్ సేఫ్టీ పై శిక్షణ అందించాలని తెలిపారు.
జిల్లా కేంద్రంలోనే కాకుండా బాన్సువాడ లో సదరం క్యాంపు ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించాలని సూచించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డి.శ్రీనివాస్ రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. చంద్రశేఖర్, జిల్లా జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఫరీదా బేగం, డిసిహెచ్‌ఎస్ విజయలక్ష్మి, జిల్లా పంచాయతీ అధికారి మురళీ, కామారెడ్డి మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్, టిజిఎంఐడిసి పొల్యూషన్, మున్సిపల్ కమీషనర్‌లు, తదితరులు పాల్గొన్నారు.