నిజామాబాద్, మార్చ్ 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు త్వరతగతిన నిర్మాణాలు చేపట్టేలా ప్రోత్సహించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. ఇప్పటికే నిర్మాణాలు ప్రారంభించిన వారు నిర్దేశిత గడువులోపు, నిబంధనలకు అనుగుణంగా నాణ్యతతో నిర్మాణ పనులు పూర్తి చేసుకునేలా పర్యవేక్షణ జరపాలని అన్నారు. ఎడపల్లి మండలం జైతాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులు చేపట్టిన ఇళ్ల నిర్మాణాలను కలెక్టర్ మంగళవారం క్షేత్రస్థాయిలో సందర్శించి పరిశీలన జరిపారు.
గ్రామంలో ఎన్ని కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయ్యాయని కలెక్టర్ ఆరా తీశారు. మొత్తం 125 మందికి మంజూరు కాగా, వారిలో 25 మంది ఇళ్ల నిర్మాణాలను చేపట్టారని అధికారులు తెలిపారు. మిగితా లబ్ధిదారులు కూడా సత్వరమే ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించేలా కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. గ్రామ సభల ద్వారా అర్హులైన వారిని లబ్ధిదారులు గుర్తిస్తూ, ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయడం జరిగిందన్నారు. లబ్ధిదారులు అందరూ సకాలంలో నిర్మాణ పనులు చేపట్టి ఇళ్లను నిర్మించుకునేలా తోడ్పాటును అందించాలని అధికారులకు సూచించారు.

అనంతరం కలెక్టర్ ఎడపల్లిలోని బాలికల రెసిడెన్షియల్ పాఠశాల/కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో కిచెన్, డైనింగ్ హాల్, స్టోర్ రూం లను సందర్శించి బియ్యం, కూరగాయలు, పప్పు దినుసులు, వంట నూనె, ఇతర సరుకుల నాణ్యతను పరిశీలించారు. కొత్త బియ్యం కావడం వల్ల వండిన అన్నం మెత్తగా అవుతోందని నిర్వాహకులు తెలుపగా, నాణ్యమైన బియ్యం కేటాయించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

కాగా, విద్యార్థినులకు మాంసాహారంతో కూడిన భోజనం అందించాల్సినపుడు చికెన్ కు బదులుగా మటన్ పెడుతున్నామని ప్రిన్సిపాల్ గంగాశంకర్ కలెక్టర్ దృష్టికి తెచ్చారు. కలెక్టర్ వెంట గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ సత్యనారాయణ తదితరులు ఉన్నారు.