డిచ్‌పల్లి, మార్చ్ 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
తెలంగాణ యూనివర్సిటీలో యాన్యువల్ డే 2025 స్పోర్ట్స్ మీట్ లో భాగంగా ఐదో రోజు జరిగిన బాలుర కబడ్డీ పోటీలను రిజిస్ట్రార్ ఆచార్య ఎం యాదగిరి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యతో పాటు క్రీడలకు సమ ప్రాధాన్యతను ఇస్తుందన్నారు. ఈసారి క్రీడలకు ప్రత్యేకమైన బడ్జెట్ను ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు.
విద్యార్థులు తమ నైపుణ్యాలు, కౌశలాలు పాఠశాల విద్యలో మొదలుకొని, కళాశాలలో, విశ్వవిద్యాలయాలలో గుణాత్మకంగా మారుతాయని పేర్కొన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయం విద్యతో పాటు, క్రీడలను, సాంస్కృతిక కార్యక్రమాలను ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. సోమవారం రిజిస్ట్రార్ ఆచార్య యాదగిరి క్రీడాకారులను పరిచయం చేసుకొని, టాస్ వేసి పోటీలను ప్రారంభించారు.
మొదటి పోరులో ఎం.ఎస్సీ కెమిస్ట్రీ జట్టు అప్లైడ్ ఎకనామిక్స్ జట్టుతో తలపడగా.. .ఉత్కంఠ పోరు నడుమ 26 పాయింట్స్ తో అప్లైడ్ ఎకనామిక్స్ గెలుపొందింది. అటు రెండవ పోరులో అప్లయిడ్ ఎకనామిక్స్ విద్యార్థులు, మాస్ కమ్యూనికేషన్ విద్యార్థులపై 29 పాయింట్స్‌తో విజయం సాధించారని వర్సిటీ స్పోర్ట్స్ డైరెక్టర్ డాక్టర్ జి బాలకృష్ణ పేర్కొన్నారు. కార్యక్రమంలో వర్సిటీ డైరెక్టర్,పి ఆర్ ఓ డా.పున్నయ్య, ఆర్గనైజింగ్ సెక్రటరీ డా.బీ ఆర్ నేత, నరేష్, కబడ్డీ ఆఫిషియల్స్‌తో పాటు క్రీడాకారులు పాల్గొన్నారు.