నిజామాబాద్, మార్చ్ 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
యాసంగి సీజన్ ధాన్యం సేకరణ ప్రక్రియలో భాగంగా మహిళా స్వయం సహాయక సంఘాలకు విరివిగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను కేటాయించాలని నిర్ణయించామని మాజీ మంత్రి, సీనియర్ శాసన సభ్యులు పి.సుదర్శన్ రెడ్డి వెల్లడిరచారు. జిల్లాలో 670 కొనుగోలు కేంద్రాలకు గాను, వాటిలో మహిళా సంఘాలకు కనీసం 200 పైచిలుకు కేంద్రాలను కేటాయించేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు.
సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం మహిళా సంఘాల ప్రతినిధులకు ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పాల్గొని ధాన్యం సేకరణ, కొనుగోలు కేంద్రాల నిర్వహణపై మహిళా సంఘాలకు కీలక సూచనలు చేశారు. మహిళా సాధికారతకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎనలేని ప్రాధాన్యత ఇస్తున్నారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుర్తు చేశారు.
ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల విద్యార్థిని, విద్యార్థులు యూనిఫామ్ లు కుట్టే బాధ్యతలను, ఇందిరమ్మ మహిళా శక్తి క్యాంటీన్లు, ఆర్టీసీ అద్దె బస్సులు, పెట్రోల్ బ్యాంకులు, సోలార్ విద్యుత్ ఉత్పత్తి యూనిట్లు వంటి సుమారు 14 రకాల పనులను ప్రభుత్వం మహిళలకు కేటాయిస్తూ, వారి అభ్యున్నతికి ఇతోధికంగా కృషి చేస్తోందని అన్నారు. ప్రభుత్వ అభిమతానికి అనుగుణంగానే ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ ద్వారా జిల్లాలోని మహిళా సంఘాలు మరింత ఆర్ధిక ప్రగతిని సాధించాలనే ఆకాంక్షతో సాధ్యమైనంత మేరకు ఎక్కువ సంఖ్యలో కేంద్రాలను కేటాయించాలని నిర్ణయించామని తెలిపారు.
గత సీజన్‌లో ఐకెపి మహిళా సంఘాల ద్వారా జిల్లాలో కేవలం 50 కేంద్రాలు మాత్రమే నిర్వహించబడ్డాయని, ప్రస్తుత సీజన్ లో ఇప్పటికే 110 కేంద్రాల నిర్వహణ కోసం ఎస్.హెచ్.జి గ్రూపులను గుర్తించడం జరిగిందని వివరించారు. వీటి సంఖ్యను కనీసం 200 పైబడి పెంచాలని, తద్వారా మహిళా సంఘాలు కొనుగోలు కేంద్రాల నిర్వహణ ద్వారా కమీషన్ రూపేణా సుమారు 5 కోట్ల రూపాయల వరకు లాభాలు ఆర్జించగలుగుతారని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆశాభావం వెలిబుచ్చారు. కొత్తగా కొనుగోలు కేంద్రాలు కేటాయించబడిన మహిళా సంఘాల ప్రతినిధులకు ధాన్యం సేకరణ, కేంద్రాల నిర్వహణపై సహకార సంఘాల బాధ్యులు, సంబంధిత అధికారులు అవగాహన కల్పించాలని సూచించారు.

ధాన్యం సేకరణ ప్రక్రియ సాఫీగా కొనసాగేలా చూడాలని, ఎవరైనా లేనిపోని ఇబ్బందులు కల్పించేందుకు ప్రయత్నిస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా మహిళా స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం పెద్ద మొత్తంలో అందిస్తున్న వడ్డీ లేని రుణాలను ఇతర సాధారణ అవసరాలకు బదలాయించకుండా వ్యాపార లావాదేవీలు నిర్వహించి ఆర్ధిక సాధికారత దిశగా ముందుకెళ్లాలని ఉద్బోధించారు.
పిల్లలకు విద్య కోసం ప్రైవేట్ పాఠశాలల్లో వేలాది రూపాయల ఫీజులు చెల్లిస్తూ అనేక మంది ఆర్ధిక పరమైన ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను పెంపొందిస్తూ, నాణ్యమైన విద్యను అందిస్తున్నందున మహిళలు తమ పిల్లలను ప్రభుత్వ బడులలో చదివించాలని, తద్వారా ఫీజుల పేరిట ఆర్థికపరమైన భారం నుండి ఉపశమనం పొందవచ్చని సూచించారు.
కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను నిర్వహించే మహిళా సంఘాలకు ప్రభుత్వపరంగా అన్ని విధాలుగా మద్దతు అందిస్తామని భరోసా కల్పించారు. ముఖ్యంగా ధాన్యం రవాణాకు సంబంధించిన లారీల విషయంలో, అలాగే హమాలీల కొరత తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. జిల్లాలో మహిళా సంఘాల ద్వారా 110 ధాన్యం కొనుగోలు కేంద్రాలు నిర్వహించాలని నిర్ణయించామన్నారు. ఇంకనూ జిల్లాలో ఆసక్తి కలిగిన మహిళా సంఘాలు కేంద్రాల నిర్వహణకు ముందుకు వస్తే, వారి అర్హతను పరిశీలించి నిర్వహణ బాధ్యతలు కేటాయిస్తామని కలెక్టర్ సూచించారు.
కేంద్రాల నిర్వహణ తీరు గురించి స్పష్టమైన అవగాహనను ఏర్పర్చుకోవాలని, లావాదేవీల నిర్వహణను సక్రమంగా నిర్వర్తించాలని హితవు పలికారు. ధాన్యం సాధారణ రకానికి క్వింటాలుకు రూ. 2300, ఏ గ్రేడ్ ధాన్యానికి రూ. 2320 రూపాయలను ప్రభుత్వం అందజేస్తుందని, దీనితో పాటు సన్న ధాన్యానికి బోనస్ రూపంలో అదనంగా క్వింటాలుకు 500 రూపాయల చొప్పున ప్రభుత్వం రైతులకు వారి బ్యాంకు ఖాతాలలో జమ చేస్తుందని అన్నారు. ఇలా పెద్ద మొత్తంలో ఆర్ధిక పరమైన లావాదేవీలతో ధాన్యం సేకరణ ప్రక్రియ ముడిపడి ఉన్నందున ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా రికార్డుల నిర్వహణను సక్రమంగా నిర్వహించేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
కొనుగోలు కేంద్రాలలో ధాన్యం సేకరణ ప్రక్రియ ముగిసిన మీదట తూకం యంత్రాలను సంబంధిత మార్కెట్ కమిటీలకు తిరిగి జాగ్రత్తగా అప్పగించాలని, గన్నీ బ్యాగులను సక్రమంగా లెక్కిస్తూ అధికారులకు అందజేయాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా తాగునీరు, షామియానాలు, కుర్చీలు వంటి అవసరమైన సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ఏ దశలోనూ రైతులు ఇబ్బందులకు గురి కాకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.
రైతులకు ధాన్యం బిల్లులతో పాటు, కేంద్రాల నిర్వాహకులకు కమిషన్ డబ్బులను సకాలంలో చెల్లించేలా చొరవ చూపుతామన్నారు. సమావేశంలో డీసీసీబీ చైర్మన్ రమేష్ రెడ్డి, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, డీఆర్డీఓ సాయాగౌడ్, సివిల్ సప్లయిస్ డీ.ఎం శ్రీకాంత్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి వాజిద్ హుస్సేన్, మెప్మా పీ.డీ రాజేందర్, డీసీఓ శ్రీనివాస్, మార్కెటింగ్ ఏ.డీ గంగవ్వ, స్వయం సహాయక మహిళా సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.