కామారెడ్డి, మార్చ్ 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
కలెక్టరేట్ కార్యాలయంలో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ రబీ సీజన్‌లో ధాన్యం సేకరణకు 446 కేంద్రాలను ఏర్పాటు చేశామని అధికారులు కొనుగోలు కేంద్రాల పట్ల ప్రత్యేక దృష్టి పెట్టాలని రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు.
రానున్న యాసంగి సీజన్ లో 26 వేల ఎకరాల వరి పంట సాగు చేసినందున సుమారుగా 6.20 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందన్నారు. కొనుగోలు కేంద్రాలకు 5.63టన్నుల ధాన్యం రానున్నదని అంచనా వేశారు. అలాగే ప్రభుత్వ అధికారులు పూర్తి సమన్వయంతో పని చేస్తూ కొనుగోలు ప్రక్రియను విజయవంతం చేయాలనీ అయన కోరారు. ధాన్యం వచ్చిన ప్రాంతాలలో వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని సూచనలు చేశారు. అదేవిధంగా అకాల వర్షాలను దృష్టి లో ఉంచుకొని కేంద్రాలలో తగినన్ని టార్పాలిన్ లను ఏర్పాటు చేయాలనీ మార్కెటింగ్ శాఖ వారికి సూచించారు.

ప్రతి కేంద్రం లో రైతులకు త్రాగునీరు, ఓఅర్ ఎస్ ప్యాకేట్స్, ఎండా తీవ్రతకు తగిన టెంట్లు ఏర్పాట్లు చేసుకోవాలని సరిపడా తేమ యంత్రాలు, ప్యాడి క్లినర్స్ అందజేయాలని కోరారు. జిల్లాకు కేటాయించిన ప్యాడి క్లినర్స్‌ను సద్వినియోగం చేసుకోవాలని అలాగే గోనె సంచులు అందుబాటులో ఉంచాలని అన్నారు. రైతుల నుండి సేకరించిన ధాన్యానికి క్వింటాలుకు కనీస మద్దతు ధర గ్రేడ్-ఏ రకానికి గాను రూ.2,320, కామన్ రకానికి రూ. 2,300, సన్న రకం వడ్లకు చెల్లించాల్సిన 500 బోనస్ కొరకు రైతులు తమ ధాన్యం వివరములను ట్యాబ్‌లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని 24 గంటలలో వారి బ్యాంక్ ఖాతాలలో డబ్బులు పడేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
జిల్లా వ్యాప్తంగా ఉన్న కొనుగోలు కేంద్రాల వద్ద సమస్యలను పరిష్కరించాడానికి జిల్లా కార్యాలయంలో టోల్ ఫ్రీ నంబర్ 08468-220051 ఏర్పాటు చేశామని తెలిపారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి.విక్టర్, జిల్లా పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ రాజేందర్, డి సి ఎస్.ఓ మల్లిఖార్జున బాబు, జిల్లా వ్యవసాయ అధికారి, జిల్లా మార్కెటింగ్ అధికారిణి రమ్య, జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారి శ్రీనివాస్, సంబందిత అధికారులు పాల్గొన్నారు.