నిజామాబాద్, మార్చ్ 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
రైతుల ప్రయోజనార్ధం జిల్లాలో యాసంగి సీజన్‌కు సంబంధించిన వరి ధాన్యం సేకరణ ప్రక్రియను నిశితంగా పర్యవేక్షణ జరిపేందుకు వీలుగా జిల్లా స్థాయిలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయాలకు సంబంధించి ఏవైనా ఇబ్బందులు ఉంటే రైతులు కంట్రోల్ రూమ్ 08462-220183 నెంబర్ కు సంప్రదించి ఫిర్యాదులు, సలహాలు, సూచనలు అందించవచ్చని సూచించారు.
ప్రతి రోజు ఉదయం 8.00 గంటల నుండి రాత్రి 8.00 గంటల వరకు కంట్రోల్ రూమ్ పని చేస్తుందని అన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని, నాణ్యతా ప్రమాణాలకు లోబడిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి పూర్తి స్థాయి మద్దతు ధర పొందాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు రైతులకు హితవు పలికారు. కాగా, రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్లు 180042500333 / 1967 లను కూడా సంప్రదించవచ్చని సూచించారు.