కామారెడ్డి, మార్చ్ 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
అర్హులైన నిరుపేద లబ్ధిదారుల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు మార్కవుట్ ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో గృహ నిర్మాణం, పంచాయతీ రాజ్, విద్యుత్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు అర్హులైన నిరుపేద లబ్ధిదారుల జాబితాల ప్రతిపాదనల మేరకు మంజూరు ఉత్తర్వులు జారీచేయడం జరిగిందని, అట్టి నిర్మాణాలకు సిద్ధంగా ఉన్న లబ్ధిదారులకు మార్క్ అవుట్ ఇవ్వాలని ఆదేశించడం జరిగిందని తెలిపారు.
ఇండ్ల నిర్మాణాలను త్వరగా చేపట్టాలని, బేస్ మెట్ వరకు ఇంటి నిర్మాణాలు జరిగిన వాటి వివరాలు యాప్లో అప్ లోడ్ చేయాలని, అట్టి వాటికి ప్రభుత్వం నుండి లక్ష రూపాయలు మొదటి విడతలో ప్రభుత్వం నుండి నిధులు లబ్ధిదారునికి విడుదల చేయడం జరుగుతుందని తెలిపారు. ఇంకనూ ప్రారంభించని ఇండ్లను త్వరగా నిర్మాణాలు చేపట్టాలని తెలిపారు. లబ్ధిదారులను నిర్మాణాలకు ప్రోత్సహించాలని సూచించారు.
ఇందిరమ్మ డేమో ఇళ్లను త్వరగా నిర్మాణాలు పూర్తిచేయాలని తెలిపారు. మండలాల వారీగా ఇంటి నిర్మాణాలపై పంచయటీకార్యదర్షులు, ఎంపీడీఓ లతో సమీక్షించారు. రెండు పడక గదుల నిర్మాణాల కాలనీల్లో నీటి సరఫరా, విద్యుత్ సరఫరా వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని, ఆయా పనులు త్వరగా పూర్తిచేయాలని అన్నారు.
సమావేశంలో జడ్పీ సీఈవో చందర్, హౌసింగ్ పి.డి. విజయపల్ రెడ్డి, విద్యుత్ శాఖ ఎస్‌ఈ శ్రావణ్ కుమార్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్, పంచాయతీ రాజ్ ఈఈ దుర్గా ప్రసాద్, ఆంజనేయులు, మిషన్ భగీరథ ఇంజనీర్లు, డిప్యూటీ ఈఈలు, ఎంపీడీఓలు, తదితరులు పాల్గొన్నారు.