‘మానవతా సదన్‌’ చిన్నారులు ఉన్నత స్థానాలకు ఎదగాలి

నిజామాబాద్‌, మార్చ్‌ 26

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

డిచ్పల్లిలోని మానవతా సదన్‌ చిన్నారులు భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు ఎదగాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు ఆకాంక్షించారు. డిచ్పల్లి టోల్‌ వే (అథాంగ్‌) ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాల నిర్వహణలో భాగంగా సుమారు 45 లక్షల రూపాయలను వెచ్చిస్తూ మానవతా సదన్‌ లో నూతనంగా వివిధ సదుపాయాలను సమకూర్చడం జరిగింది. స్టడీ రూమ్‌, రెండు టాయిలెట్లు, ఫ్రిడ్జ్‌, భారీ స్క్రీన్‌ తో కూడిన టెలివిజన్‌, సదన్‌ ఆవరణలో ఆర్‌.సి.సి సిట్టింగ్‌ బెంచీలు, వంట పాత్రలు, ఇతర సామాగ్రిని సదన్‌ కు వితరణ చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, అనాధ బాలలను అన్నివిధాలుగా ఆదుకునేందుకు వీలుగా ఇదివరకు జిల్లాలో కలెక్టర్‌ గా కొనసాగిన ప్రస్తుత రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శి యోగితారాణా తన హయాంలో 2016లో నెలకొల్పిన మానవతా సదన్‌ రాష్ట్రంలోనే కాకుండా జాతీయ స్థాయిలో ప్రత్యేకతను చాటుకుంటోందని అన్నారు. సదన్‌ లోని బాలలను సిబ్బంది తమ సొంత బిడ్డలుగా చూసుకుంటూ వారి అభ్యున్నతికి పాటుపడుతుండడం వల్ల అనేకమంది ఇంజినీరింగ్‌ వంటి ఉన్నత చదువులు చదువుతున్నారని అన్నారు.

అందుబాటులో ఉన్న వనరులను, జిల్లా యంత్రాంగం తోడ్పాటును సద్వినియోగం చేసుకుంటూ భవిష్యత్తులో ఐ.ఏ.ఎస్‌, ఐ.పీ.ఎస్‌ లుగా కూడా రాణించాలని కలెక్టర్‌ ఆకాంక్షించారు. ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని, క్రమశిక్షణ, అంకిత భావం, ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తే ఉన్నత లక్ష్యాలను సాధించవచ్చని సూచించారు. తాము అనాథలం, తమకు తల్లితండ్రులు లేరు అనే భావన పిల్లల దరి చేరకుండా వారికి అవసరమైన అన్ని రకాల సదుపాయాలు సమకూర్చేందుకు జిల్లా యంత్రాంగం చొరవ చూపుతోందని, ఈ దిశగా డిచ్పల్లి టోల్‌ వే ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ కూడా ముందుకు వచ్చి తోడ్పాటును అందించడం అభినందనీయమని అన్నారు.

విద్యార్థిని, విద్యార్థులు చక్కగా చదువుకుని ఉన్నత స్థానాలకు చేరినప్పుడే మానవతా సదన్‌ ఆశయాలు, లక్ష్యాలు పూర్తి స్థాయిలో నెరవేరినట్లు అవుతాయని అన్నారు. అన్ని రంగాల్లో సత్తా చాటుతూ, ఇతరులకు ఆదర్శంగా నిలువాలని సూచించారు. సదన్‌ నిర్వహణకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, వాటిని పరిష్కరించేందుకు జిల్లా యంత్రాంగం తరపున కృషి చేస్తామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా సదన్‌ చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమం ఆహుతులను ఆకట్టుకుంది.

కార్యక్రమంలో మానవతా సదన్‌ లైజనింగ్‌ ఇంచార్జ్‌ సుధాకర్‌, కేర్‌ టేకర్‌ రమేష్‌, టోల్‌ వే ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ ప్రాజెక్ట్‌ మేనేజర్‌ అనిల్‌, రిషా, రోడ్‌ సేఫ్టీ విభాగం అధికారి హర్ష, స్థానిక అధికారులు పాల్గొన్నారు.

Check Also

బాబు జగ్జీవన్‌ రావు గొప్ప మానవీయ విలువలకు ప్రతిరూపం

Print 🖨 PDF 📄 eBook 📱 డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »